వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: చైనా యువత కావాలని కోవిడ్ తెచ్చుకుంటున్నారు.. ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా కోవిడ్

చెన్ 85 ఏళ్ల తండ్రికి డిసెంబర్‌లో కోవిడ్ సోకింది. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ దొరకలేదు.. కనీసం ఎవరైనా డాక్టరుకు చూపిద్దామన్నా కూడా అవకాశం లేకుండాపోయింది.

చెన్ తన తండ్రిని బీజింగ్‌లోని చావోయాంగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లమని సూచించారు. లేదంటే కారిడార్‌లో కూర్చోవాలని చెప్పారు.

''అక్కడ ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. శ్వాస యంత్రాలు (రెస్పిరేటరీ మెషీన్) లేవు. వేరే వైద్య పరికరాలు కూడా ఏమీ అందుబాటులో లేవు’’ అని బీబీసీతో చెన్ చెప్పారు.

దాంతో అక్కడి నుంచి వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అందులో బెడ్ దొరికింది. అది కూడా పలుకుబడి ఉన్న ఓ వ్యక్తితో పైరవీ చేయిస్తే బెడ్ దొరికింది. కానీ, అప్పటికే చెన్ తండ్రికి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకింది.

మొత్తానికి ఎలాగోలా చెన్ తండ్రి కోవిడ్ నుంచి కోలుకుని బతికి బయటపడ్డారు. కానీ, మళ్లీ ఆయనకు కోవిడ్ సోకితే ఈసారి బతకడం కష్టమని చెన్ ఆందోళన చెందుతున్నారు.

చైనాలో కోవిడ్ కట్టడికి మూడేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహాలన్నీ వృథా అని, అవన్నీ విఫలమయ్యాయని చెన్ అన్నారు.

ముఖ్యంగా సరైన జాగ్రత్తలు, ఏర్పాట్లు లేకుండానే కోవిడ్ ఆంక్షలను ఒక్కసారిగా సడలించారని.. దానివల్ల పెద్దసంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడ్డారని చెన్ అన్నారు.

'వైరస్ మరోసారి విజృంభించొచ్చు. అప్పుడు వయోధికులు దాన్ని తట్టుకుని బతకడం అనేది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది’ అన్నారు చెన్.

చైనా

'స్వచ్ఛందంగా కోవిడ్ ఇన్ఫెక్షన్‌ తెచ్చుకుంటున్నాం’

చైనా జీరో కోవిడ్ పాలసీ నుంచి ఆదివారంతో పూర్తిగా వైదొలగింది. ఆదివారం నుంచి అక్కడ అంతర్జాతీయ సరిహద్దులూ తెరిచారు. సామూహికంగా కోవిడ్ టెస్ట్‌లు చేయడం, కఠిన క్వారంటైన్, ఆకస్మిక లాక్‌డౌన్‌లు వంటివేమీ ఇప్పుడు లేకపోవడంతో చెన్ వంటివారు స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కానీ, చైనాకు చెందిన యువతరంలో చాలామంది మాత్రం చెన్‌లాంటి వారితో పోల్చినప్పుడు పూర్తి భిన్నంగా ఉంటున్నారు. కొందరైతే తాము స్వచ్ఛందంగానే కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నామని 'బీబీసీ’తో చెప్పారు.

కోడింగ్ పనిచేసే షాంఘైకి చెందిన ఓ 27 ఏళ్ల యువకుడు ఒకరు ఇంతవరకు వ్యాక్సీన్ ఒక్క డోస్ కూడా తీసుకోలేదు. తాను కావాలనే వైరస్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నట్లు చెప్పారాయన.

'నా హాలిడే ప్లాన్ నేను చేంజ్ చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడే కోవిడ్ సోకి కోలుకుంటే నా హాలిడే సమయానికి నేను ఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటాను’ అన్నారాయన. కోవిడ్ కారణంగా వచ్చిన కండరాల నొప్పులను తాను ఊహించనప్పటికీ మిగతా లక్షణాలన్నీ ఊహించినవేనని ఆయన అన్నారు.

షాంఘైకే చెందిన మరో 26 ఏళ్ల యువతి బీబీసీతో మాట్లాడుతూ కోవిడ్ సోకిన ఓ స్నేహితురాలి దగ్గరకు కావాలనే తాను వెళ్లానని.. 'కోవిడ్‌తో బాధపడుతున్న స్నేహితురాలి దగ్గరకు వెళ్తే నాకు కూడా కోవిడ్ వస్తుంది కదా’ అందుకే వెళ్లాను అన్నారామె.

అయితే. కోవిడ్ సోకిన తరువాత దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందని.. జలుబు వచ్చి తగ్గిపోతుందని తాను అనుకున్నానని.. కానీ, ఇప్పుడు చాలా కష్టంగా ఉందని ఆమె చెప్పారు.

కోవిడ్ బాధితులు

ఉత్తర జెఝియాంగ్ ప్రావిన్స్‌లోని జియాజింగ్‌లో పనిచేసే ఓ 29 ఏళ్ల మహిళ మాట్లాడుతూ సరిహద్దులు తెరవడం మంచి పరిణామమని.. సంగీత కచేరీలు చూడ్డానికి చైనాలో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.

'కోవిడ్ ఆంక్షల సమయంలో ఎక్కడికైనా వెళ్లాలంటే మా మేనేజర్ పర్మిషన్ తప్పనిసరి అయ్యేది. ఇప్పడు ఆ బాధ లేదు. జీవితం మళ్లీ కోవిడ్ పూర్వస్థితికి రావాలని కోరుకుంటున్నాను. అయితే... పెద్దవాళ్ల ఆరోగ్యం ఎలా అనే భయం మాత్రం ఉంది’ అన్నారామె.

ఆమె తాత కోవిడ్ బారిన పడినప్పుడు ఆయన హాస్పిటల్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా మారినప్పుడు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్లలేదు. నిజానికి అప్పటికి హాస్పిటల్స్‌లో బెడ్స్ కూడా దొరకడం లేదు. స్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం మృతదేహాలు పెద్దఎత్తున పేరుకుపోయాయన్న వార్తలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఈ మహిళకు ఇంతవరకు కోవిడ్ సోకలేదు. కానీ, ఆమె భర్తకు కోవిడ్ సోకింది. ఈమె 24 గంటలూ మాస్క్ ధరిస్తారు. చివరకు నిద్రపోతున్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటారీమె.

'అందరం ఒకేసారి కోవిడ్ బారినపడడం ఇష్టం లేదు. అలా అని కోవిడ్ అంటే భయమేమీ లేదు. ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఒకప్పడు అంత తీవ్రంగా లేవు కదా’ అన్నారామె.

రెస్టారెంట్లలో చైనా ప్రజలు

చైనాలోని పెద్ద నగరాల్లో ప్రజలు మాల్స్‌, రెస్టారెంట్లు, పార్కులకు రావడం మొదలైంది. వీసాలు, టూరిజం పర్మిట్ల కోసం కూడా బారులు తీరుతున్నారు.

అయితే కొందరికి మాత్రం ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితులు ఇబ్బందికరమే. లూ భర్త ఇంతవరకు కోవిడ్ వ్యాక్సీన్ వేసుకోలేదు. ఆయనకు డయాబెటిస్ తీవ్రంగా ఉండడంతో వైద్య కారణాలతో టీకా వేసుకోలేదు.

ఇప్పుడు దేశంలో కోవిడ్ నిబంధనలు తొలగించడంతో వీరు స్వయంగా మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఇంటికి సరఫరా అయ్యే ప్రతి సామగ్రిని డిజ్‌ఇన్ఫెక్టర్లతో శుభ్రం చేశాకే వాడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లూ, ఆమె భర్త ఇద్దరికీ కోవిడ్ సోకింది. వీళ్ల కుమార్తెకూ కోవిడ్ సోకింది.

కోవిడ్ వ్యాక్సీన్ కోసం ఆమె ఎముకలు కొరికే చలిలో ఎన్నోచోట్లకు తిరిగారు. చివరకు బ్లాక్ మార్కెట్లో 7500 చైనీస్ యువాన్ (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 90 వేలు)లకు ఆమె కొనుగోలు చేశారు.

'నా భార్య కోవిడ్ నుంచి సులభంగానే కోలుకున్నారు. అదే నాకు పెద్ద రిలీఫ్’ అన్నారు లూ. కానీ, ఇంకో వేవ్ వస్తే ఆయన పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.

చైనా కోవిడ్

బీజింగ్‌కే చెందిన వాంగ్, ఆమె కుటుంబసభ్యులు పాక్స్లోవిడ్ వ్యాక్సీన్‌ను ముందే కొనుక్కున్నారు. వాంగ్ తన 90 ఏళ్ల తాత కోసం ఆక్సిజనేటర్, పల్స్ ఆక్సీమీటర్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే అయనకు కోవిడ్ సోకలేదు.

'కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం అనేది వ్యాపారాలకు మంచిది. వ్యాపారాలు వేగంగానే కోలుకుంటాయి’ అన్నారు వాంగ్.

అయితే, చైనా గ్రామీణ ప్రాంతాల ప్రజల స్పందన ఎలా ఉందనేది స్పష్టంగా తెలియదు. ఇంతకాలం కోవిడ్‌ను అత్యంత ప్రమాదకారిగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో గందరగోళం ఉంది.

కొందరు మాత్రం ఇప్పటికే ఆంక్షలన్నీ సడలించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. బీజింగ్‌కు చెందిన 52 ఏళ్ల లీ మాట్లాడుతూ.. 'ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కోవిడ్ మొదలైన తరువాత మొదటి రెండేళ్లు ప్రభుత్వం సరిగానే వ్యవహరించింది. 2022 ప్రారంభంలోనే జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయాల్సింది’ అన్నారు.

2022 మాకు అంత కష్టమేమీ కలిగించలేదు.. 2023 ఎలా ఉండనుందో చూడాలి అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: China's youth are getting Covid wantedly.. Why?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X