వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

భారత్‌లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కానీ థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. మరోవైపు, స్పెయిన్‌లో ఐదో వేవ్ వచ్చిందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా మన జీవితాలను శాసిస్తోంది. కోవిడ్ ఆంక్షల్లో బంధీగా మారిన జనం మళ్లీ సాధారణ స్థితికి ఎప్పుడు వెళ్తామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

టీకాలతో కోవిడ్‌కు చెక్ పెట్టి, మళ్లీ మామూలు జీవితం గడపొచ్చని ఆశపడుతున్నారు.

కానీ కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

SARS-CoV-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ఇమ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది.

'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు.

కరోనా వైరస్ సాధారణ జనజీవనంలో భాగమై పోతుందని, ప్రపంచవ్యాప్తంగా దీని ఉనికి ఉంటుందని పేర్కొన్నారు.

వ్యాధులతో మానవజాతి పోరాడటం కొత్తేమీ కాదు. కానీ ఈ వైరస్ కొన్ని నిర్ధిష్ట సవాళ్లను విసురుతోంది.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

1. కోవిడ్-19ను మనం ఎందుకు వదిలించుకోలేము?

అంటువ్యాధులను నిర్మూలించడం అంత సులువైన పని కాదు.

మానవ చరిత్రలో ఇప్పటివరకు కేవలం రెండే వైరస్‌లను అంతమొందించినట్లు డబ్ల్యూహెచ్‌వో నిర్ధరించింది. అవి ఒకటి మశూచి, మరొకటి రిండర్ పెస్ట్.

మశూచి ఒక పురాతన వ్యాధి. మానవ జాతి చరిత్రలో అంటువ్యాధులకు కారణమిదే.

20వ శతాబ్ధంలో దాదాపు 500 మిలియన్ల మందిని ఈ వ్యాధి బలితీసుకుంది.

1980లో ఈ వైరస్‌ను నిర్మూలించగలిగారు. వ్యాధి భౌగోళిక వ్యాప్తి, సంక్రమణ పరంగా చూస్తే దీన్ని ప్రస్తుతమున్న కోవిడ్ 19తో పోల్చవచ్చు.

ప్రత్యేకమైన పరిస్థితులు నాడు మశూచిని నిర్మూలించడానికి సహాయపడ్డాయి. వైరస్ సంక్రమణను నిరోధించే టీకా తయారీ ద్వారా మశూచిని అంతమొందించగలిగారు.

2. కరోనా టీకాలు వ్యాధి సంక్రమణను అడ్డుకోలేవా

కరోనా కోసం ఇప్పటివరకు అభివృద్ధి చేసిన‌ టీకాలేవీ వ్యాధి సంక్రమణను అడ్డుకోలేకపోయాయి.

'ఇప్పుడు మనం వాడుతున్న టీకాలు వ్యాధి సంక్రమణను అడ్డుకోలేవు. అవి కేవలం వ్యాధి ప్రభావ తీవ్రతను తగ్గిస్తాయి. వ్యాక్సీన్ తీసుకున్న వ్యక్తులు కూడా వైరస్‌ను ఇతరులకు అంటించగలరు' అని లండన్ స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ ట్రాఫికల్ మెడిసన్‌కు చెందిన ఎపిడెమాలజీ అంటువ్యాధుల ప్రొఫెసర్ డేవిడ్ హేమన్ తెలిపారు.

'కోవిడ్ ఎప్పటికీ అంతంకాదు. రాబోయే రోజుల్లో వైరస్ బారిన పడకుండా వ్యాక్సీన్లు మనల్ని రక్షించలేవు' అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూకే) మెడిసిన్ ప్రొఫెసర్ పాల్ హంటర్ పేర్కొన్నారు.

'టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా... ఇక జీవితాంతం మనం వైరస్ బారిన పడుతూనే ఉంటాం. ఇది అనివార్యం' అని ఆయన చెప్పారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

3. భవిష్యత్‌లో కరోనా వైరస్ ఎలా మారబోతోంది?

కరోనావైరస్ జన జీవనంలో సాధారణ వ్యాధిగా మిగిలిపోతుందని నమ్మే వారిలో ప్రొఫెసర్ హేమన్ కూడా ఒకరు. అంటే ఈ వ్యాధి రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూనే ఉంటుంది.

ఇది కొత్తగా ఏం ఉండదు. ఫ్లూ వైరస్‌తో పాటు 4 కరోనా వైరస్ రకాలు సాధారణ జలుబుకు కారణమవుతాయి.

ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 2,90,000 నుంచి 6,50,000 వరకు ప్రజలు ఫ్లూ సంబంధిత కారణాలతో మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది.

కానీ మరణాల సంఖ్య ప్రకారం చూస్తే ఈ ఫ్లూ వ్యాధులు నియంత్రణలోకి వచ్చాయి.

శాస్త్రవేత్తలు అంచనా, రాజకీయ నాయకుల ఆశ ఏంటంటే కరోనావైరస్ ప్రజలతో మమేకం అవ్వడం ఖాయం. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగనిరోధక శక్తిని ప్రజలు పొందుతారు. కాబట్టి కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు చూస్తున్నట్లుగా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య ఉండబోదు.

కానీ మనం అనుకున్నట్లుగానే భవిష్యత్‌లో వైరస్ ప్రవర్తన ఉంటుందా అనేది ఇక్కడ పెద్ద సమస్య.

ప్రొఫెసర్ హేమన్ 'ఇది చాలా అస్థిరమైనది' అని అన్నారు.

'వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించినప్పుడు సమయానుకూలంగా ఉత్పరివర్తన చెందుతుంది. ఇందులో కొన్ని మ్యుటేషన్లు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి'

కానీ ఇతర మార్గాల్లో సంక్రమించే కరోనావైరస్ ఇప్పటితో పోలిస్తే తక్కువ ప్రభావశీలత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

'వైరస్ తీవ్రతలో కూడా తగ్గుదల ఉంటుంది. ఈ తగ్గుదల అనేది మ్యుటేషన్ల వల్ల కావచ్చు లేదా ఎక్కువ మంది ప్రజలు టీకా తీసుకుని ఉండటం వల్ల అయిన కూడా కావచ్చు' అని ప్రొఫెసర్ హేమన్ అన్నారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

4. కరోనాకు కూడా మళ్లీ మళ్లీ టీకాలు వేసుకోవాల్సి ఉంటుందా?

ప్రతి వైరస్ ఒక క్రమాన్ని పాటిస్తుంది. వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు వ్యాపించడానికి వీలుగా ఉత్పరివర్తనం చెందుతూ ఉంటుంది.

'వైరస్ పరిణామక్రమం ప్రకారం, వైరస్ మ్యుటేషన్ చెందాల్సి ఉంటుంది. అలా అయితేనే అది ఎక్కువ మందికి సోకగలదు. సులభంగా వ్యాప్తి చెందగలిగే వైరసే విజయవంతమైన వైరస్' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ ట్రాడీ లాంగ్ వివరించారు.

ఫ్లూ వైరస్‌లో మార్పులు రావడం చాలా సాధారణ అంశం. అందుకే వాటికి అనుగుణంగా ఫ్లూ వ్యాక్సీన్‌ను ప్రతిఏడాది ఆరోగ్య సంస్థలు సమీక్షిస్తుంటాయి. టెటనస్ లాంటి వ్యాధులకు మన జీవితాంతం బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

https://www.youtube.com/watch?v=CwZ4mr-Vupw

మనకు తెలిసిన వరకైతే కరోనావైరస్ 4 మ్యుటేషన్లుగా పరివర్తనం చెందింది. ఇందులో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌ను తొలుత భారత్‌లో గుర్తించారు. ప్రస్తుతం యూరోప్, ఆసియా, అమెరికాలో దీని ప్రభావం కాస్త తగ్గింది.

డెల్టా వేరియంట్‌పై టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు డెల్టా వేరియంట్‌తో ఆసుపత్రిలో చేరిన 82 శాతం కేసులు... టీకా తీసుకోకపోవడం వల్ల లేదా కేవలం ఒకే డోసు తీసుకోవడం వల్ల నమోదైనవిగా పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

రాబోయే శీతాకాలంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు 30 మిలియన్లకు పైగా ప్రజలకు బూస్టర్ డోస్‌ను ఇచ్చేందుకు బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ (ఎన్‌హెచ్‌ఎస్) ప్రణాళికలు రచిస్తోంది.

బూస్టర్ డోస్ యాంటీబాడీలను పెంచుతుందా, ఎక్కువకాలం రక్షణ ఇస్తుందో లేదో తెలుసుకునేందుకు అమెరికా నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ పూర్తి స్థాయిలో టీకాలు పొందిన ప్రజలపై క్లినికల్ ట్రయల్స్‌‌ను ప్రారంభించింది.

ఇక్కడ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే... కోవిడ్-19 వ్యాక్సీన్ల ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియదు.

ఎందుకంటే ఈ వ్యాక్సీన్లు వారికి పూర్తిగా కొత్తవి. అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాల రోగనిరోధకతను పరిశోధకులు ఇంకా విశ్లేషిస్తున్నారు.

'మనం ఇంకా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు' అని ప్రొఫెసర్ హేమన్ అన్నారు.

'ఫ్లూ కన్నా ఇది భిన్నమైన వైరస్. ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడం కూడా తప్పే' అని పేర్కొన్నారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

5. లాక్‌‌డౌన్స్ కామన్ అవుతాయా?

కరోనావైరస్ విస్తరించడం, ఆసుపత్రుల్లో చేరికలు పెరిగిపోవడంతో చాలా దేశాలు, ప్రాంతాలు ప్రయాణ ఆంక్షలు విధించాల్సి వచ్చింది.

వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి, ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించడానికి ఈ ఆంక్షలు ఉపయోగపడ్డాయి. కానీ ఆర్థిక నష్టాలు, నిరుద్యోగం పెరగడానికి కూడా కారణమయ్యాయి.

వైరస్ సాధారణ జనజీవనంలో కలిసిపోయాక కూడా లాక్‌డౌన్స్ విధించాల్సి వస్తుందా? అంటే వ్యాక్సినేషన్ విజయవంతం కావడం, ప్రతి దేశంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గడం వంటి అంశాలపై అది ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గత కొన్నినెలలుగా దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక ఆంక్షలను మనం చూశాం.

'వైరస్ వ్యాప్తి విస్తృత‌మైన‌ప్పుడు ప్రభుత్వాలు దాన్ని కట్టడి చేసేందుకు వీలైనంతవరకు లాక్‌డౌన్‌లను ఒక మార్గంగా ఉపయోగించుకుంటాయి' అని హాంగ్‌కాంగ్ సిటీ యూనివర్సిటీ హెల్త్ సెక్యూరిటీ ప్రొఫెసర్ నికోలస్ థామస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

6. ఫేస్‌మాస్క్ వాడటం తప్పదా?

మహమ్మారి విస్తరిస్తోన్న తరుణంలో మాస్క్ వాడకం తప్పనిసరి చేయడం కోసం తీసుకున్న కొన్ని చర్యలు వివాదాస్పదమయ్యాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ రాజకీయ అంశంగా మారాయి.

వ్యాక్సినేషన్ ప్రక్రియ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ముఖానికి మాస్క్‌‌లు ధరించాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

'కేసులు పెరుగుతున్న ప్రతిసారి లాక్‌డౌన్ విధించడం సాధ్యం కాదు' అని కోపెన్‌హాగన్ యూనివర్సిటీ బిహేవియరల్ సైంటిస్ట్ క్రిస్టినా గ్రావెర్ట్ అన్నారు.

'అనారోగ్యంగా ఉన్న వారు ప్రజా రవాణా వ్యవస్థకు దూరంగా ఉండటం, ఇంటి నుంచే పనిచేసుకోవడం ఉత్తమం. లేదా కనీసం చుట్టు పక్కలా జనాలు ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం సమంజసంగా ఉంటుంది' అని ఆమె అన్నారు.

కొన్ని ఆసియా దేశాల్లో మాస్క్ వాడకం విస్తృతంగా ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అంతగా మాస్క్ వాడట్లేదు.

https://www.youtube.com/watch?v=fIufzwOqEcs

ఉదాహరణకు పూర్తి స్థాయిలో వ్యాక్సీన్ తీసుకున్న వారు మాస్క్ తప్పనిసరిగా వాడాల్సిన పనిలేదంటూ ఏప్రిల్‌లో అమెరికా నిర్ణయం తీసుకుంది.

ఆక్సియోస్-ఇప్సోస్ కరోనా వైరస్ ఇండెక్స్ ప్రకారం అప్పటినుంచి రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో మాస్క్ వినియోగించే వారి శాతం 74 నుంచి 63 శాతానికి పడిపోయింది.

వాక్సినేషన్ పూర్తి కాని వారు కూడా మాస్క్ వాడకం తగ్గించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

ప్రజారోగ్య సంరక్షణ ప్రచారంలో భాగంగా ఇంటిలో కూడా మాస్క్ లు ధరించాల్సిందిగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కొందరు వాదిస్తున్నారు.

మరికొందరు మాస్క్ ధరించే బాధ్యత ప్రజలదే అని పేర్కొంటున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను వాడుతున్నప్పుడు లేదా సమూహంలో తిరుగుతున్నప్పుడైనా కనీస మర్యాదగా మాస్క్ వాడాలని కొందరు సూచిస్తున్నారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

7. అంతర్జాతీయ ప్రయాణాల సంగతేంటి?

ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ దేశ సరిహద్దుల్ని మూసివేయడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి, తమ ప్రజల్ని వైరస్ నుంచి రక్షించడానికి మధ్య నలిగిపోతున్నాయి.

వేర్వేరు దేశాలు వేర్వేరు నిబంధనలు పాటిస్తున్నాయి. వీటిని ప్రొఫెసర్ హేమన్ ప్రపంచ దేశాలు చేస్తోన్న బలహీనమైన చర్యగా విమర్శిస్తున్నారు.

'వ్యాక్సీన్ల అసమాన పంపిణీ జరుగుతోంది కాబట్టి డబ్ల్యూహెచ్‌వో వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్‌‌ను సిఫారసు చేయదు. కానీ కొన్ని దేశాలు వీటిని ఉపయోగించుకుంటాయని భావిస్తున్నా' అని హేమన్ అన్నారు.

https://www.youtube.com/watch?v=FgklT4eMITE

ఏదేమైనప్పటికీ యూరోపియన్ యూనియన్ ఇప్పటికే డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్‌ను అందిస్తోంది.

వ్యాక్సీన్ తీసుకున్న వారు, కోవిడ్ నెగెటివ్ రిజల్ట్ వచ్చిన వారు, ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్న వారు ఈ సర్టిఫికెట్‌తో ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఖండంలో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తోంది.

ఈ టీకా పాస్‌పోర్ట్‌ను ఈయూకు చెందిన 27 సభ్య దేశాలు ఆమోదించాయి. వీటితో పాటు ఐస్‌లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ కూడా టీకా పాస్‌పోర్ట్‌ను సమ్మతించాయి.

ఇక మిగతా దేశాలు తమ సరిహద్దుల నుంచి ప్రజలు ప్రయాణించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

2020 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయి. మహమ్మారి కారణంగా 2021లో 1.4 ట్రిలియన్ డాలర్ల పర్యాటక ఆదాయం కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ అంచనా వేసింది. తక్కువ ఆదాయ దేశాలు ఆ నష్టాన్ని భరిస్తున్నాయి.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

8. వ్యాక్సీన్ డెమోక్రసీ అనేది సాధ్యమేనా?

జూలై 5 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ప్రజలు వ్యాక్సీన్ పూర్తి డోసులు తీసుకున్నారు. అంటే ఇది ప్రపంచ జనాభాలో కేవలం 15 శాతం మాత్రమే.

'గ్లోబల్ కమ్యూనిటీగా మనం విఫలమవుతున్నాం' అని ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గాబ్రెయోసెస్ అన్నారు.

కోవిడ్-19 వేరియంట్స్‌‌ను పారద్రోలడానికి మానవతావాదం అంశంతో పాటు 'టీకా ప్రజాస్వామ్యం' కూడా ముఖ్యమే.

డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో అధినేతలు ఇటీవలే విడుదల చేసిన బహిరంగ లేఖలో... పేద దేశాల్లో టీకాల కొరత, ప్రపంచంలో కొత్త మ్యుటేషన్లు ఏర్పడటానికి కారణమవుతుందని హెచ్చరించారు.

https://www.youtube.com/watch?v=4Jq3Phfh5ck

'అసమాన వ్యాక్సీన్ పంపిణీ... లక్షలాది మంది ప్రజలను వైరస్ బారిన పడేయటమే కాకుండా, ప్రాణాంతక మ్యుటేషన్లకు కూడా కారణమవుతుంది. ఈ మ్యుటేషన్లు తిరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయి' అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

'అధునాతన టీకా కార్యక్రమాలు పాటించిన దేశాలు కూడా తిరిగి కఠినమైన ప్రజారోగ్య చర్యలను తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా జరిగి ఉండాల్సింది కాదు'

ఇటీవలి జీ-7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్) నాయకులు పేద దేశాలకు 100 కోట్ల వ్యాక్సీన్ డోసులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం పేద దేశాల ప్రజలకు వ్యాక్సీన్ అందించాలంటే 1100 కోట్ల టీకా డోసుల అవసరం ఉంది. దీంతో పోలిస్తే జీ7 దేశాలు ప్రకటించింది చాలా తక్కువ.

'ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ల సమాన పంపిణీ జరిగేలా చూడటంలో ప్రజారోగ్యం, మానవతా బాధ్యత దాగి ఉంది' అని ప్రొఫెసర్ హేమన్ చెప్పారు.

కోవిడ్‌తో కలిసి జీవించడం ఎలా?

9. జంతువుల ద్వారా ప్రమాదం పొంచి ఉందా?

జంతువులలో వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో అనే అంశం సార్స్- కోవ్-2కు వ్యతిరేకంగా మనం చేసే పోరాటంపై ఆధారపడి ఉంటుంది.

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టి మధ్యవర్తి ద్వారా మానవులకు వ్యాపించిందనే అంశాన్ని ఈరోజు వరకు కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

ఈ వైరస్ పిల్లులు, కుందేళ్లు, చిట్టెలుకలకు మరీ ముఖ్యంగా మింక్స్‌కు కూడా సోకుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మింక్స్ ద్వారా వైరస్ మానవులకు సోకినట్లు డెన్మార్క్ శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు.

ప్రకృతిలో జంతువులు ఉన్నంతవరకు అవి వైరస్ బారిన పడతాయి. వాటి ద్వారా మానవులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

'వ్యాధులు పొంచి ఉన్నాయి. అవకాశం ఇస్తే అవి వ్యాపిస్తాయి' అని స్మిత్‌సోనియన్ కన్సర్వేషన్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో వన్యప్రాణి పశు వైద్యుడు డాన్ జిమ్మెర్మాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 may never end, how to live with it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X