
కోవిడ్, మంకీ బి .. ఇప్పుడు బాగా వ్యాప్తి చెందే మరో కొత్త వైరస్ : యూకేని వణికిస్తున్న నోరోవైరస్ !!
కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరైన యూకేను ఇప్పుడు మరో వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొత్తగా యూకేలో నోరోవైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) ఇటీవల యూకేలో కేసుల్లో నోరోవైరస్ కేసులను గుర్తించినట్లుగా వెల్లడించింది. కరోనా మహమ్మారి నుండి కాస్త ఉపశమనం పొందగానే కొత్తగా నోరోవైరస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

యూకేలో కొత్త వైరస్ .. వాంతులు, విరేచనాలతో నోరో వైరస్
మే చివరి నుండి ఐదు వారాల్లో, ఇంగ్లాండ్‌లో 154 నోరోవైరస్ కేసులు నమోదయ్యాయని పిహెచ్‌ఈ తెలిపింది. మరింత ఆందోళన కలిగించే పరిణామంలో భాగంగా ముఖ్యంగా నర్సరీ మరియు పిల్లలలో నోరోవైరస్ కేసులు పెరగడాన్ని పిహెచ్ఈ నివేదించింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం, నోరోవైరస్ అనేది వ్యాపించే స్వభావమున్న వైరస్. ఇది వాంతులు మరియు విరేచనాలకు కారణమవుతుంది. పిహెచ్ఈ దీనిని "శీతాకాలపు వాంతి బగ్" అని పిలుస్తుంది.

యూకేలో పెరుగుతున్న కేసులు .. ప్రపంచానికి కొత్త ఆందోళన
సిడిసి ప్రకారం, నోరోవైరస్ అనారోగ్యం ఉన్నవారు బిలియన్ల వైరస్ కణాలను వాంతులు, విరేచనాల ద్వారా విసర్జిస్తారు. అందులో కొద్దిపాటి వైరస్ కణాలు కూడా ఇతరులకు వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి. నోరోవైరస్ కేసుల పెరుగుదల ఇంగ్లాండ్‌తో పాటు, కోవిడ్ -19 వ్యాప్తితో ఇప్పటికే ఆందోళనలో ఉన్న ప్రపంచానికి మరోమారు టెన్షన్ పుట్టిస్తుంది. సిడిసి ప్రకారం, ఒక వ్యక్తి సోకిన వ్యక్తిని ప్రత్యక్షంగా సంప్రదించడం ద్వారా, కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం మరియు కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా నోరోవైరస్ సంక్రమణకు గురవుతారని వెల్లడించింది.

నోరో వైరస్ లక్షణాలు ఇవే
నోరో వైరస్ యొక్క లక్షణాలను చూస్తే విరేచనాలు, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి ప్రధానంగా లక్షణాలుగా ఉంటాయి. ఇక ఎలాంటి లక్షణాలు లేని కేసులు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈ వైరస్ కడుపు లేదా పేగుల వాపుకు కారణమవుతుంది .దీనిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మందిలో నోరోవైరస్ సంక్రమించిన 12 నుండి 48 గంటలలోపు లక్షణాలు బహిర్గతమవుతాయి. అవి 1 నుండి 3 రోజుల వరకు ఉంటాయి.

నోరో వైరస్ బారిన పడకుండా ఉంటాలంటే చెయ్యాల్సింది ఇదే
నోరో వైరస్ లో కూడా అనేక రకాల మ్యూ టేషన్ వైరస్ లు ఉన్నాయి. కొన్ని రకాల నోరోవైరస్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో నిపుణులు ఇంకా గుర్తించలేకపోయారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూసుకోవడం ద్వారా, కలుషితం లేని మంచి నీళ్లు తాగడం ద్వారా నోరోవైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. నోరోవైరస్ మానవుల మలంలో రెండు నుండి అంతకంటే ఎక్కువ వారాలపాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మందులు లేవు .. శరీరం కోల్పోయే నీటిని ద్రవాలను తీసుకోని కాపాడుకోవటమే మార్గం
దీనికి నిర్దిష్ట ఔషధం లేదని, వాంతులు విరోచనాలు నుండి శరీరం కోల్పోయిన నీటిని, అధికంగా ద్రవాలను తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్లుగా సమాచారం. ఇది కూడా బాగా వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్ కావటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా మహమ్మారి తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రకరకాల వైరస్లు దాడి చేస్తూ మానవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆరోగ్య సంక్షోభంలోకి నెడుతున్నాయి.