Hormuz Risk to India: హార్ముజ్ జలసంధి మూసేసిన ఇరాన్-భారత్ కు ఇక..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) చేస్తున్న మూకుమ్మడి దాడులతో అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి పర్షియన్ గల్ఫ్ లో కీలకమైన హార్ముజ్ జలసంధిని (strait of hormuz) మూసేసింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఐదో వంతు ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంది. దీంతో హార్ముజ్ మూసివేత ప్రభావం భారత్ పైనా పడేలా ఉంది.
గత కొన్ని నెలలుగా హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సేకరణలో భారత్ ప్రభావం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌పై చేస్తున్న దాడులు, ఆపై ఇరాన్ ప్రతీకార చర్యలతో మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్ కూ సమస్యలను సృష్టిస్తున్నాయి. తన ముడిచమురులో దాదాపు 90% దిగుమతి చేసుకునే భారత్‌కు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఉద్రిక్తతలు చమురు సరఫరాను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాలుగా మారుతోంది.

ప్రపంచ ముడిచమురు సరఫరాలో 20-25% రవాణా జరిగే ఈ జలసంధి మూతపడటంతో భారత్, చైనా సహా పలు దేశాలకు సమస్యలు తప్పేలా లేవు. పర్షియన్ గల్ఫ్‌కు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఈ ఇరుకైన జలసంధి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన యూఏఈ, ఒమన్ దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. 100 మైళ్ల పొడవున విస్తరించిన ఈ జలసంధి..ఇరాన్ వద్ద 21 మైళ్ల వెడల్పు మాత్రమే కలిగి ఉంది. అనలిటిక్స్ సంస్థ వోర్టెక్సా నివేదిక ప్రకారం, గత ఏడాది ఈ జల సంధి ద్వారా రోజుకు 20 మిలియన్ బారెళ్లకు పైగా ముడిచమురు, కండెన్‌సేట్లు, శుద్ధి చేసిన ఉత్పత్తులు రవాణా అయ్యాయి.

కెప్లర్ నౌక ట్రాకింగ్ డేటా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకునే ముడిచమురులో సుమారు 2.5–2.7 మిలియన్ బారెళ్లు అంటే దాదాపు 50 శాతం ఈ జలసంధి గుండా రావాల్సిందే. ఇది ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుండి రవాణా అవుతోంది. తాజాగా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకున్న భారత్.. మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడుతోంది. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ పై పడబోతోంది. ఈ యుద్ధం తీవ్రత పెరిగితే తక్షణమే ధరలు, సరుకు రవాణా, బీమా ఖర్చులు పెరగవచ్చని అంచనా. చివరికి సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడవచ్చు, అయితే ప్రస్తుతం ఉత్పత్తి తగ్గే అవకాశం తక్కువని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications