డొనాల్డ్ ట్రంప్.. గ్రేట్ కమ్ బ్యాక్: వాషింగ్టన్‌లో ల్యాండ్
Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెస్ట్ ఫ్రంట్‌కు బదులుగా కేపిటల్ వన్ ఎరినాలోకి మారిందీ కార్యక్రమం.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి.
ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి కిందటే వాషింగ్టన్ చేరుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5:20 నిమిషాలకు భార్య మెలానియా, కుమారుడు బారోన్ ట్రంప్‌తో కలిసి ఇక్కడి డల్లెస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా నార్త్ వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ప్రెస్ బ్రీఫ్‌ను సున్నితంగా తిరస్కరించారు. వారికి అభివాదం చేశారంతే. అంతకుముందు 5:13 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కటుంబంతో కలిసి వాషింగ్టన్‌కు బయలుదేరారాయన.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ హాజరు కానున్నారు. చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్ టీమ్ ఇందులో పాల్గొనబోతోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, హంగేరి ప్రధాని విక్టర్ ఒర్బన్, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరు కానున్నారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, టిక్ టాక్ సీఈఓ షుయ్ జి చ్యూ హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications