భారత్-పాక్ యుద్ధం అపడానికి ఇచ్చిన ఆదేశాలివే..! ట్రంప్ మరో సంచలనం..!
కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు కేంద్రం అంగీకరించింది. కానీ తన మధ్యవర్తిత్వం వల్లే భారత్-పాక్ యుద్దం ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు. దీన్ని ప్రధాని మోడీ స్వయంగా ఆయనతో ఫోన్ కాల్ లో ఖండించినా ట్రంప్ మాత్రం ఊరుకోవడం లేదు.
తాజాగా మరోసారి భారత్-పాక్ యుద్ధం ఆపేందుకు తాను తీసుకున్న చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలను ట్రంప్ బయటపెట్టారు. భారత్- పాక్ మధ్య యుద్ధం సాగుతున్న తరుణంలో తాను ఎవరెవరికి ఏయే ఆదేశాలు ఇచ్చారో కూడా ట్రంప్ వెల్లడించారు. తద్వారా యుద్ధం ఆపింది తానే అని చెప్పుకునేందుకు మరోసారి ప్రయత్నించారు. భారత్ వాదనకు విరుద్ధంగా ట్రంప్ వెల్లడించిన ఈ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.

భారత్-పాక్ యుద్ధం జరుగుతుండగా.. ట్రంప్ తన ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌లతో రెండు దేశాలతో అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెప్పానని వెల్లడించారు. ఈ అల్టిమేటం పనిచేసిందని, భారత్-పాక్ ఇద్దరూ తనను సంప్రదించారని తెలిపారు. మేమేం చేయాలని తనను అడిగారన్నారు. మీరు అమెరికాతో వాణిజ్యం కలిగి ఉండాలనుకుంటున్నారా లేదా ఒకరిపై ఒకరు అణ్వాయుధాలను ఉపయోగించాలనుకుంటున్నారా అని ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. తాను అయితే దానిని అనుమతించబోనని తేల్చి చెప్పానన్నారు. చివరికి వారిద్దరూ యుద్ధ విరమణకు అంగీకరించారన్నారు. వారిద్దరికీ (భారత్, పాకిస్తాన్ ) గొప్ప నాయకులు ఉన్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరోవైైపు భారత్ మాత్రం ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వాదనను ఖండించింది. తాజాగా ప్రధాని మోడీ సైతం ఫోన్ కాల్ లో ట్రంప్ కు భారత్-పాక్ వివాదాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వం కోరుకోవడం లేదని తేల్చిచెప్పేశారు. అయినా తన పాత్ర ఉందని చెప్పుకోవడం ట్రంప్ కే చెల్లిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications