వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలాన్ మస్క్: ‘గూగుల్ సహ వ్యవస్థాపకుడి భార్యతో నాకు అఫైర్ ఉందన్నది నిజం కాదు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎలాన్ మస్క్

గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్‌ తో తనకు ఎఫైర్ ఉందన్న వార్తలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఖండించారు.

నికోల్‌ షానహాన్‌తో సంబంధం కారణంగానే బ్రిన్, మస్క్‌ల స్నేహం చెడిపోయిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం పై మస్క్ స్పందించారు.

ఇదంతా ఒట్టి అబద్ధమని ఎలాన్ మస్క్ అన్నారు. బ్రిన్, తాను ఇప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, గత రాత్రే తాము పార్టీలో కలుసుకున్నామని మస్క్ అన్నారు.

https://twitter.com/WholeMarsBlog/status/1551255128719577088

ఎలాన్ మస్క్, నికోల్ షానహాన్‌ల గత ఏడాది చివర్లో కలుసుకున్నారంటూ వారికి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.

ఈ వ్యవహారమే నికోల్‌తో విడాకులను బ్రిన్‌ను ప్రేరేపించిందని, ఇద్దరు హై ప్రొఫైల్ బిలియనీర్ల మధ్య స్నేహం చెడిపోవడానికి కారణమైందని కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

అయితే, ఈ వార్తలను ఖండిస్తూ, ''నికోల్‌ను నేను గత మూడేళ్లలో రెండేసార్లు చూశాను. అది కూడా చుట్టుపక్కల అందరూ ఉన్నప్పుడే. నథింగ్ రొమాంటిక్'' అంటూ ట్వీట్ చేశారు.

డిసెంబర్‌లో వారిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడేనాటికి బ్రిన్, నికోల్‌లు విడిపోయినప్పటికీ, కలిసే జీవిస్తున్నారంటూ వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది.

ఈ కథనాన్ని విమర్శిస్తూ ''నా గురించి, టెస్లా గురించి వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇలాంటి ఎన్ని పనికిమాలిన కథనాలు ప్రచురించిందో చెప్పలేను'' అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

వివాదాల్లో ఎలాన్ మస్క్

ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో ఎలాన్ మస్క్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చిన మస్క్, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీనిపై న్యాయ వివాదం కొనసాగుతోంది.

ఎలాన్ మస్క్‌ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అదే ఇండెస్క్ ప్రకారం గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ ను ప్రపంచంలో ఎనిమిదో ధనవంతుండిగా పేర్కొంది.

ఎలాన్ 2009లో ట్విటర్‌లో ఖాతా తెరిచినప్పటి నుంచీ ఆయన చేసిన ట్వీట్లు ఆయన్ను చాలాసార్లు ఇబ్బందుల్లో పడేశాయి. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

2019లో బ్రిటన్‌కు చెందిన కేవ్ డైవర్ వెర్నాన్ ఉన్స్‌వర్త్‌ను ఓ ట్వీట్‌లో 'పీడో గై' అని అభివర్ణించిన ఎలాన్ మస్క్.. పరువునష్టం దావాను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు.

దానికి ఏడాది ముందు థాయ్‌లాండ్‌లోని ఓ భూగర్భ గుహలో చిక్కుకుపోయిన 12 మంది టీనేజీ కుర్రాళ్లను కాపాడే ఆపరేషన్‌కు సారథ్యం వహించిన వెర్నాన్ ఉన్స్‌వర్త్ ఆ ఉదంతంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.

అప్పుడు ఆ ఆపరేషన్‌కు సాయం చేయటానికి ఎలాన్ మస్క్ ప్రయత్నించారు. ఒక మినీ సబ్‌మెరీన్‌ను విరాళంగా ఇవ్వాలనుకున్నారు.

కానీ.. ఎలాన్ ఆఫర్‌ను ''ప్రచార గిమ్మిక్కు''గా వెర్నాన్ ట్విటర్‌లో కొట్టివేయటంతో ఆయనతో ఎలాన్ ట్విటర్‌లో మాటల యుద్ధానికి దిగారు.

కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని 2020 మార్చిలో మహమ్మారిగా ప్రకటించినపుడు లాక్‌డౌన్ల వంటి చర్యలను విమర్శిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్లు చేశారు. అవి ''తెలివితక్కువ'' పనులని కూడా అభివర్ణించారు.

కొత్త కరోనావైరస్ వల్ల ఎవరైనా చనిపోయారనేది నిర్ధారించటానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ ఆ ఏడాది జూన్ 30వ తేదీన ఆయన చేసిన ట్వీట్ చాలా అపకీర్తి మూటగట్టుకుంది.

ఎలాన్ మస్క్ తను వ్యాక్సీన్ వేయించుకున్నప్పటికీ.. వ్యాక్సీన్ తప్పనిసరి అనే ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించారు.

వ్యాక్సీన్ వేయించుకోవటం తప్పనిసరి చేయటాన్ని నిరసిస్తూ కెనడా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగినపుడు.. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చుతూ ఎలాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ యూదు సంస్థలకు ఆగ్రహం కలిగించింది.

ఎలాన్ మస్క్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు

యుక్రెయిన్ పై దాడి మీద విమర్శలు

యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర మీద చాలా మంది ప్రముఖుల నుంచి తీవ్ర ఆవేశంతో ప్రతిస్పందనలు వచ్చాయి. అయితే ఎలాన్ మస్క్ ప్రతిస్పందన చాలా విచిత్రమైన ప్రతిస్పందనల్లో ఒకటి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తనతో ద్వంద్వ యుద్ధం చేయాలని సవాల్ చేస్తూ ఈలాన్ మస్క్ మార్చి 14న ట్వీట్ చేశారు.

''వ్లాదిమిర్ పుతిన్‌ను ముఖాముఖి యుద్ధానికి సవాల్ చేస్తున్నా. పందెం యుక్రెయిన్'' అంటూ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత నేరుగా రష్యా అధ్యక్షుడి అధికారిక అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ మళ్లీ ఇదే సవాల్ విసిరారు.

ఎలాన్ మస్క్ పై బైడెన్‌ చెణుకులు

ఎలాన్ మస్క్ అనేక వాణిజ్య కొనుగోళ్ల ద్వారా తన సంపదను ఆర్జించారు. అందులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఒకటి. ఈ రంగం వాణిజ్యంలో అది అగ్రగామి సంస్థగా ఉంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలో విద్యుత్ కార్ల ఉత్పత్తి గురించి గత జనవరిలో చేసిన వ్యాఖ్యతో ఎలాన్ మస్క్ నొచ్చుకున్నట్లుగా ఉంది. బైడెన్ వ్యాఖ్యల్లో టెస్లా కంపెనీని ప్రస్తావించకుండా, ఆ కంపెనీ ప్రత్యర్థి కంపెనీలను ప్రస్తావించారు.

''బైడెన్ మనిషి రూపంలో ఉన్న నకిలీ తోలుబొమ్మ'' అంటూ ఎలాన్ మస్క్ జనవరి 27న ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Elon Musk: 'It's not true that I had an affair with Google co-founder's wife'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X