మిస్ టీన్ ఇండియా అమెరికా ఈషా చంద్ర కోడె మన విజయవాడ అమ్మాయే
అమెరికాలో అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా మూడు విభాగాలకు జరిగిన పోటీలో మిస్ ఇండియా అమెరికా 2019 కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన కిమ్ కుమారీ దక్కించుకోగా... విధి దవే మిసస్ ఇండియా అమెరికా 2019 విజేతగా నిలిచారు. ఇక న్యూజెర్సీకి చెందిన ఈషా చంద్ర కోడె మిస్ టీన్ ఇండియా అమెరికా 2019 కిరీటం దక్కించుకున్నారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ ఇన్ ఫోర్డ్స్‌లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.

మిస్ ఇండియా అమెరికా 2019గా కిమ్ కుమారి
కిమ్ కుమారి న్యూజెర్సీలో నివాసముంటోంది. కంటి డాక్టరు కావాలనేది ఆమె లక్ష్యంగా ఉన్నట్లు చెప్పింది. కంటి డాక్టరై కళ్ల గురించి వాటి ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నదే తన ధ్యేయం అని చెప్పారు.అంతేకాదు మహారాష్ట్ర జానపద నృత్య విభాగంలో ఆమె టాలెంట్ కనబర్చడంతో ఆమెకు బెస్ట్ టాలెంట్ అవార్డు దక్కింది.

మిసస్ ఇండియా అమెరికా 2019గా విధి దవే
ఇక మిసస్ ఇండియా అమెరికాగా గెలుపొందిన విధి దవే కనెక్టికట్‌కు చెందింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి డేటా సెంటిస్ట్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భరతనాట్యం, జానపద నృత్యాలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం తన హాబీలుగా పేర్కొన్నారు. మహిళా సాధికారతపై గళం విప్పి మాట్లాడాలని మహిళాభివృద్ధికి కృషి చేయాలని ఉన్నట్లు విధి దవే తెలిపారు. అంతేకాదు సామాజిక కార్యకర్తగా పనిచేసి సమాజసేవకు తనవంతు కృషి చేయాలని చెప్పుకొచ్చారు.

మిస్ టీన్ ఇండియా అమెరికా 2019గా ఈషా చంద్ర కోడె
మిస్ టీన్ ఇండియా అమెరికా 2019 కిరీటాన్ని దక్కించుకున్న ఈషా న్యూజెర్సీలో నివాసముంటున్నారు. ఆమెకు ఫ్యాషన్ రంగంలో రాణించి ఎప్పటికైనా టాప్ మోడల్‌గా పేరుగాంచాలనేదే తన లక్ష్యం అని వివరించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించి సినిమాల్లో నటించాలని ఉన్నట్లు ఈషా స్పష్టం చేశారు. ఇక చదువు విషయానికొస్తే పిడియాట్రిక్ సర్జన్ కావాలని ఉన్నట్లు ఈషా చెప్పారు.
ఇక అమెరికా దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది మహిళలు యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఫైనల్స్‌కు మాత్రం 75 మంది మాత్రం వచ్చారు. ఇందులో ఈ ముగ్గురు మహిళలు విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ ముంబైలో జరగనున్న మిస్ మరియు మిసెస్ ఇ:డియా పోటీల్లో కిమ్ కుమారి, విధి దవే పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications