వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిఫా వరల్డ్ కప్: ఖతార్ ఆతిథ్యంపై ఇన్ని గొడవలెందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫిపా వరల్డ్ కప్

ఫుట్‌బాల్ అభిమానులు ఎదురుచూస్తోన్న 'ఫిఫా వరల్డ్ కప్’ ఆదివారం ఖతార్‌లో ప్రారంభం కాబోతోంది.

ఈ మెగా టోర్నీ ఫైనల్స్ కోసం 15 లక్షల మంది ఫుట్‌బాల్ ప్రేమికులు ఖతార్‌ను సందర్శించనున్నట్లు అంచనా .

అయితే, అసలు ఈ టోర్నీని గల్ఫ్ దేశమైన 'ఖతార్’‌లో నిర్వహించాలనే నిర్ణయంపై అనేక విమర్శలు వచ్చాయి.

ఖతార్‌లో స్వలింగ సంపర్కం నిబంధనలు ఎలా ఉంటాయి?

ఖతార్‌లో స్వలింగ సంపర్కం అనేది చట్ట విరుద్ధం. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఇలాంటి చర్యలను అక్కడివారు అనైతికంగా భావిస్తారు.

ఈ నేరానికి జరిమానాలు, ఏడేళ్లవరకు జైలు శిక్ష, రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలు విధిస్తారు.

''అందరూ ఆహ్వానితులే, ఎవ్వరిపై వివక్ష ఉండదు’’ అని ఖతార్ వరల్డ్ కప్ నిర్వాహకులు ప్రకటించారు.

కానీ, స్వలింగ సంపర్కానికి సంబంధించి ఖతార్ ప్రభుత్వం తమ చట్టాలను మార్చబోదని, సందర్శకులు 'ఇక్కడి సంస్కృతిని గౌరవించాలని’ ఖతార్ 2022 చీఫ్ ఎగ్జిక్యూటివ్ నాజర్ అల్ ఖతెర్ నొక్కి చెప్పారు.

''స్వలింగ సంపర్కం అనేది మెదడుకు నాశనకారి. ఈ టోర్నీకి హాజరయ్యే ఎల్‌జీబీటీక్యూ ప్రజలు ఇక్కడి నిబంధనలను అంగీకరించాలి’’ అని ఖతార్ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఖాలిద్ సల్మాన్ అన్నారు.

ఇటీవలి ఒక హ్యుమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం స్వలింగ సంపర్కులు, లెస్బియన్లు, ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేయడం, కొన్నిసార్లు వారు లింగమార్పిడి థెరపీలకు హాజరయ్యేట్లు ఒత్తిడి చేయడం వంటి చర్యలను ఖతార్ భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది.

ఆ నివేదికలో తప్పుడు ఆరోపణలు ఉన్నాయని ఖతార్ ప్రభుత్వం తోసిపుచ్చింది.

'' సైద్ధాంతిక లేదా రాజకీయ యుద్ధాల్లోకి ఫుట్‌బాల్‌ను లాగకూడదు. ఇప్పుడు మీరు ఆటపైనే దృష్టి కేంద్రీకరించండి’’ అంటూ వరల్డ్ కప్‌లో పాల్గొనే 32 జట్లకు ఫిఫా లేఖ రాసింది.

ఫిఫా లేఖకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ సహా 10 యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాలు ''మానవ హక్కులు సార్వత్రికమైనవి. అవి అన్నిచోట్లా వర్తిస్తాయి’’ అని బదులు ఇచ్చాయి.

ఎల్‌జీబీటీక్యూ ప్రజలకు మద్దతును ప్రకటిస్తూ ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీకేన్ సహా ఇతర తొమ్మిది జట్ల కెప్టెన్లు తమ చేతులకు ''వన్ లవ్’’ అనే బ్యాండ్లను ధరించనున్నారు.

దోహాలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం

ఖతార్ విదేశీ కార్మికులతో ఎలా వ్యవహరిస్తుంది?

వరల్డ్ కప్ ఫైనల్స్ కోసం కొత్త స్టేడియాలు, హోటళ్లు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను ఖతార్‌లో నిర్మించారు.

వీటి నిర్మాణం కోసం భారత్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్‌లకు చెందిన 30,000 మంది కార్మికులు పనిచేసినట్లు అంచనా.

ఖతార్‌కు వరల్డ్ కప్ బిడ్ దక్కినప్పటి నుంచి అక్కడ 6,500 మంది కార్మికులు మరణించినట్లు 2021 ఫిబ్రవరిలో గార్డియన్ పత్రిక పేర్కొంది.

ఖతార్‌లోని దౌత్యకార్యాలయాల నుంచి తాము సేకరించిన డేటా ఆధారంగా గార్డియన్ ఈ లెక్కలు వేసింది.

గార్డియన్ లెక్కలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఖతార్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఖతార్‌లో చాలాకాలం పాటు నివసించిన విదేశీ కార్మికులను, వరల్డ్ కప్ ప్రాజెక్టుల్లో పాల్గొనని కార్మికులను కూడా గార్డియన్ పరిగణలోకి తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య పెద్దమొత్తంలో ఉన్నట్లు కనిపిస్తోందని ప్రభుత్వం చెప్పింది.

అధికారిక రికార్డుల ప్రకారం 2014 నుంచి 2020 మధ్య వరల్డ్ కప్ స్టేడియాల నిర్మాణ ప్రదేశాలలో 37 మంది కార్మికులు మరణించారని, అందులో ముగ్గురు మాత్రమే పని చేస్తుండగా మరణించినట్లు వెల్లడించింది.

గుండె నొప్పి, శ్వాస సంబంధిత కారణాలతో మరణిస్తే వాటిని పని చేస్తుండగా జరిగిన మరణాలుగా ఖతార్ ప్రభుత్వం పరిగణించదని అంతర్జాతీయ కార్మిక సంస్థ వ్యాఖ్యానించింది. అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తుంటే కూడా ఈ రకమైన మరణాలు సంభవిస్తాయని కార్మిక సంస్థ తెలిపింది. ఈ రకంగా చూస్తే మరణాల సంఖ్యను ఖతార్ ప్రభుత్వం తగ్గించి చెప్పినట్లే అని అన్నది.

కేవలం 2021లోనే 50 మంది విదేశీ కార్మికులు మృతి చెందారని, 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, మరో 37,600 మంది తేలికపాటి గాయాల నుంచి ఓ మోస్తరు గాయాలకు గురయ్యారని ఆ సంస్థ అంచనా వేసింది.

ఫుట్‌బాల్

ఆల్కహాల్‌ను అనుమతిస్తుందా?

వరల్డ్ కప్ స్టేడియాల దగ్గర బీర్ అమ్మకాలను అనుమతించబోమని టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఖతార్ ప్రకటించింది.

ఇప్పుడు కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో, విలాసవంతమైన హోటళ్ల బార్లలో మాత్రమే ఆల్కహాల్ అందుబాటులో ఉంటుంది.

ఒక క్యాన్ బీరు కొనాలంటే 10 పౌండ్లు (రూ. 969) నుంచి 12 పౌండ్లు (రూ. 1162) మధ్య ఖర్చు అవుతుంది.

ఆల్కహాల్ రహిత బీర్లను స్టేడియాల్లో అమ్ముతారు.

ఆతిథ్య దేశంగా ఖతార్‌ను ఎందుకు ఎన్నుకున్నారు?

2010లో జరిగిన బిడ్‌లో ఖతార్ 2022 ఫిఫా వరల్డ్ కప్ హక్కులను దక్కించుకుంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఓడించి ఖతార్ ఈ బిడ్‌ను సాధించింది.

ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న తొలి అరబ్ దేశం ఖతార్.

బిడ్ కోసం ఫిఫా అధికారులకు 3 మిలియన్ పౌండ్లు (రూ. 29 కోట్లు) లంచంగా ఇచ్చిందని ఖతార్‌పై ఆరోపణలు వచ్చాయి. కానీ, రెండేళ్ల దర్యాప్తు తర్వాత ఖతార్‌కు క్లీన్ చిట్ లభించింది.

ఖతార్ బిడ్‌కు అప్పటి ఫిఫా చైర్మన్ సెప్ బ్లాటర్ మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు ఆయనే ఖతర్‌కు వరల్డ్ కప్ ఆతిథ్య బాధ్యతలు ఇవ్వడం ఒక పొరపాటు అని అంటున్నారు.

వరల్డ్ కప్ కోసం ఖతార్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది?

8 స్టేడియాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో ఏడు స్టేడియాలు కొత్తగా కట్టినవే.

దాదాపు 100 కొత్త హోటళ్లు, ఒక కొత్త మెట్రో వ్యవస్థ, రహదారుల నిర్మాణంతో పాటు, హమద్ విమానాశ్రయాన్ని విస్తరించారు.

లుసైల్ స్టేడియం పరిసరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఖతర్‌లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి?

ఫైనల్స్ నాటికి ఖతార్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెల్సియస్‌గా ఉంటాయి.

జూన్ లేదా జూలైలో టోర్నీని నిర్వహించే ఉంటే మ్యాచ్‌లు ఎప్పటిలాగే 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో బహుశా ఒక్కోసారి 50 డిగ్రీ సెల్సియస్‌లో జరిగి ఉండేవి.

వేసవిలో టోర్నీ జరిగితే ఎయిర్ కండీషన్డ్ స్టేడియాల్లో ఫైనల్స్‌ను నిర్వహించాలని ఖతార్ తొలుత అనుకుంది. తర్వాత ఈ ప్రణాళికను తిరస్కరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
FIFA World Cup: Why so much fuss over hosting Qatar?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X