ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్- యుద్ధం వేళ..!!
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
పహల్గామ్‌లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో ప్రధానమైనవి- దేశంలో నివసించే పాకిస్తానీయులను బహిష్కరించడం. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయడం.

దీనితో పాటు పాకిస్తాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ వెబ్‌సైట్లనూ నిషేధించింది. ది డాన్, జియో టీవీ, ఏఆర్‌వై న్యూస్, సమా టీవీ, బోల్ న్యూస్ వంటి మీడియా హౌస్‌కు చెందిన యూట్యూబ్ ఛానళ్ల భారత్‌లో పని చేయట్లేదు. వాటి కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నిషేధానికి గురయ్యాయి.
అక్కడితో దీనికి బ్రేక్ పడలేదు. ఒకరిద్దరు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల యూట్యూబ్ ఛానళ్లనూ నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్, షహీన్ షా అఫ్రిదీ యూట్యూబ్ ఛానళ్లు భారత్‌లో ఇదివరకే నిషేధానికి గురయ్యాయి. భారత్‌పై దుష్ప్రచారం చేస్తోన్నారనే కారణంతో వారిద్దరికీ అలా షాక్ ఇచ్చింది కేంద్రం.
మరి కొందరు పాకిస్తాన్ క్రికెటర్లు ఈ జాబితాలో చేరారు. వారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు నిషేధానికి గురయ్యాయి. పాక్ మాజీ కేప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, హ్యారిస్ రవూఫ్, మాజీ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్ ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా భారత్‌లో పని చేయట్లేదు.
అదే సమయంలో పాకిస్తాన్-ఇ- తెహ్రీక్ అధినేత, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సైతం భారత్‌లో ఓపెన్ కావట్లేదు. భారత్‌లో ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ అకౌంట్ నిషేధానికి గురైంది. పాకిస్తాన్-ఇ- తెహ్రీక్ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ సైతం భారత్‌లో స్తంభించిపోయింది. ఈ రెండు ఎక్స్ హ్యాండిళ్లను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే Account with held అని చూపిస్తోంది.
నిజానికి- కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించలేదని, పాకిస్తాన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ అహ్మద్ షా ఉద్దేశపూరకంగానే ఈ రెండు అకౌంట్లను కూడా భారత్‌లో స్తంభించిపోయేలా చర్యలు చేపట్టారని సమాచారం.
పాకిస్తాన్-ఇ- తెహ్రీక్ చేసే అన్ని ట్వీట్లను కూడా రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం నిఘా ఉంచిందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పీటీఐ తనకు అనుకూలంగా మలచుకుంటోందని, రాజకీయ అనిశ్చితికి దారి తీసేలా పోస్టింగులు వేస్తోందని ఆర్మీ హెడ్ క్వార్టర్ భావిస్తోన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications