తాలిబన్లు కాదు, అంతకుమించి ప్రమాదకారులున్నారు: దళాల ఉపసంహరణపై జో బైడెన్ వ్యాఖ్యలు
వాషింగ్టన్/కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఆప్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దూరమవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆగస్టు 19న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునేందుకు రోడ్లపైకి జాతీయ జెండాలతో వచ్చిన పౌరులపై తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పలువురు మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.

అందుకే అమెరికా దళాల ఉపసంహరణ: జో బైడెన్
అయితే, ఆప్ఘాన్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకే తాము ఆప్ఘానిస్థాన్ నుంచి వైదొలిగామని జో బైడెన్ తెలిపారు. ఆప్ఘాన్ నుంచి తమ సేనలను ఉపసంహరించుకోవడాన్ని సమర్థించుకున్నారు. ముప్పు ఉన్న చోట దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జో బైడెన్ తెలిపారు. సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఆల్‌ఖైదా, ఐసిస్ ప్రాబల్యం పెంచుకున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని బైడెన్ పేర్కొన్నారు. అయితే, తాలిబన్లు అమెరికా సేనలు వెళ్ళిపోయిన స్వల్పకాలంలోనే ఆప్ఘానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆప్ఘానిస్థాన్‌లోని అమెరికన్లను పూర్తిగా తరలించేంత వరకూ తమ దేశాలు అక్కడే ఉంటాయన్నారు.

ఆప్ఘాన్ పౌరులకు అమెరికా ఆశ్రయం..
కాగా, దాదాపు 30 వేల మంది ఆప్ఘాన్ శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇవ్వనుందని, ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని జో బైడెన్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఆప్ఘాన్ లోని అమెరికా సేనలకు దుబాసీలుగా, ఇన్‌ఫార్మర్లుగా పనిచేసిన వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, అమెరికన్లతోపాటు ఆప్ఘాన్ పౌరులు కూడా విమానాల్లో ఆ దేశానికి పయనమవుతున్నారు. ఇక తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆప్ఘానిస్థాన్‌కు ఆయుధాలను విక్రయించకూడదని అమెరికా నిర్ణయించింది. ఆయుధాలను విక్రయించకుండా నిషేధం విధిస్తున్నట్లు బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక, అమెరికా బ్యాంకుల్లోని సొమ్మును వాడుకోకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఆప్ఘాన్‌లో తీవ్రంగా పరిస్థితులు
ఆప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైననాటి నుంచీ ఆ దేశంలోని పౌరులు విదేశాలకు వెళ్లిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లేందుకు చాలా మంది విఫలయత్నం చేస్తున్నారు. కొందరు మహిళలు తమ పిల్లలను కాబూల్ విమానాశ్రయంలోని అమెరికా దళాలకు గోడల అవతలి నుంచి విసిరేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒంటరిగా మహిళలు కనిపిస్తే కాల్చి వేసే పరిస్థితులు నెలకొనడంతో మహిళలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఆప్ఘాన్ పౌరులకు తాము ఎలాంటి హాని చేయమంటూనే.. తమను వ్యతిరేకించేవారిని మాత్రం వదిలిపెట్టమని తాలిబన్లు హెచ్చరిస్తుండటం గమనార్మం. ఇప్పటికే తాలిబన్ల దాడుల్లో వందల మంది ఆప్ఘాన్ పౌరులు మరణించారు.
Recommended Video

దేశం నుంచి పారిపోతూ ఆప్ఘాన్ జాతీయ ఫుట్‌బాలర్ దుర్మరణం
ఇటీవల విదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినవారిలో ఆప్ఘనిస్థాన్ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా ఉండటం విచారకరం. కాబూల్ విమానాశ్రయంలో విమానంపై నుంచి కిందపడి మరణించాడు. ఆప్ఘన్ వార్తా సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమెరికా, బ్రిటర్, ఇతర దేశాలకు చెందిన విమానాల్లో ఎక్కి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. ఆఫ్ఘాన్ జాతీయ పుట్ బాల్ ఆటగాడు జాకీ అన్వారి కూడా దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నించాడు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన యూఎస్ఏఎఫ్ బోయింట్ సీ-17 విమానంలో చోటు లేకపోవడంపై దాని చక్రాలు పట్టుకుని ప్రయాణించే ప్రయత్నం చేశాడు. అయితే, విమానం టేకాఫ్ అవగానే.. జారి కిందపడిన అన్వర్ ప్రాణాలు కోల్పోయాడు. జాకీ మరణాన్ని జనరల్ డైరెక్టరేట్ ఫర్ స్పోర్ట్స్ నిర్ధారించింది. ఈ మేరకు ఆప్ఘాన్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.












Click it and Unblock the Notifications