మేం వస్తే హిందువులు తిరిగొస్తారు: ఇమ్రాన్, దీపావళి...
ఇస్లామాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ నుండి వెళ్లిపోయిన హిందువులు అందరు తిరిగి వస్తారని పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశం నుంచి పారిపోయిన హిందువులందరూ తాము అధికారంలోకి రాగానే వస్తారన్నారు. దేశంలో హిందూ వర్గాలు దురాగతాలను ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో దేశంలో బలవంతపు మతమార్పిడిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. వారి మతానికి వ్యతిరేకంగా హిందువులు, కలాష్ కమ్యూనిటీలను బలవంతంగా ఇస్లాంలోకి మార్పు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తమ మంచితనం ద్వారా ముస్లీంలు ఇస్లాంను వ్యాప్తి చేయాలే తప్ప, బలవంతంగా కాదన్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి పార్లమెంటు ఎదుట జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14వ తేదీ నుండి ఇమ్రాన్ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం కూడా ధర్నా చేసింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనార్టీలకు భద్రత కల్పిస్తామని చెప్పారు. మహమ్మద్ అలీ జిన్నా కల సాకారం చేసేందుకు అన్ని వర్గాలకు తమ ప్రభుత్వంలో సమాన న్యాయం, సమాన హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాగా, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ఇమ్రాన్ పార్టీ హిందూ పండుగ అయిన దీపావళిని హిందువులతో కలిసి జరపనుంది.
దీపావళి సెలవు కావాలని...
ఈ నెల 23న దీపావళి పండుగకు సెలవు కావాలంటూ పాకిస్థాన్‌లోని మైనార్టీ హిందూ కమ్యూనిటీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను డిమాండ్ చేస్తోంది. ఆ రోజు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని, పండుగ సందర్భంగా తమకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. పాక్ హిందు కౌన్సిల్ పోషకుడు డాక్టర్ రమేశ్ కుమార్ వాంక్వానీ, అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ... సెలవు ప్రకటించటంవలన సదరు కమ్యూనిటీకి సాయం చేసినవారవుతారన్నారు.
అంతేగాక తాము పాకిస్థానీ దేశభక్తి కలవారమని, వార్షిక పండుగకు సెలవు పొందే హక్కు తమకు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ విషయాన్ని తాను జాతీయ అసెంబ్లీలో లేవనెత్తుతానని అతను అన్నారు. దేశంలోని లోని ఏ రాజకీయ పార్టీ కూడా మైనార్టీ కమ్యూనిటీల సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపడం లేదన్నారు.
దీపావళికి అధికారికంగా మలేషియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్, సింగపూర్, ఫిజి, ఇండియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సెలవు ఉందన్నారు. కానీ, పాకిస్తాన్ కార్యాలయాలకు వెళ్లని హిందువులకు రాలేదన్నట్లు మార్క్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications