పాక్ ప్రధాని పదవిలోనే ఇమ్రాన్-ఆపద్ధర్మ నేతను నియమించేదాకా-సుప్రీం విచారణ రేపటికి వాయిదా
పాకిస్తాన్ లో విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చివరి నిమిషం వరకూ మౌనంగా ఉండి సిక్సర్ కొట్టిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇప్పటికీ తనదైన శైలిలో పావులు కదుపుతూనే ఉన్నారు. ఇప్పటికే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన ఇమ్రాన్.. తన నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు మరింత ఊరట లభించింది. అదే సమయంలో ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించే వరకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా కొనసాగుతారని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఖాన్.. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224(ఎ)(4) ప్రకారం ప్రస్తుత పీఎం ఖాన్ పదవిలో కొనసాగుతారని అల్వీ లేఖలో పేర్కొన్నారు.

తాత్కాలిక ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన మూడు రోజుల్లోగా ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు ఆపద్ధర్మ ప్రధాని పేరుపై ఏకీభవించని పక్షంలో, జాతీయ అసెంబ్లీ స్పీకర్ తక్షణమే ఏర్పాటు చేసే కమిటీకి ఇద్దరు నామినీల పేర్లను పంపాలని అల్వీ చెప్పారు. దీంతో ఇప్పుడు ఇమ్రాన్ స్ధానంలో ఆపద్ధర్మ ప్రధానిని ప్రతిపాదించక తప్పని పరిస్ధితి విపక్షాలకు నెలకొంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ఆయన వారసుడి ఎంపికపై విపక్షాలు దృష్టిపెట్టాల్సిన పరిస్ధితి.












Click it and Unblock the Notifications