చైనా గ్రేట్ గుడ్ న్యూస్
Kailash Mansarovar Yatra: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కైలాష్ మనస సరోవర్ యాత్రపై చైనా తీపి కబురు ఇచ్చింది. ఇకపై భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి అంగీకారం తెలిపింది. ఈ ఏడాది వేసవి నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అయిదు సంవత్సరాల కిందట చైనాకు విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసింది భారత్. 2020లో ప్రాణాంతక కరోరా వైరస్ వ్యాప్తి చెందడం, అదే ఏడాది తూర్పు లఢక్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది.

అప్పటి నుంచి విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మధ్య జరిగిన చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.
విమాన సర్వీసుల పునరుద్ధరణ సహా పలు ఇతర అంశాలపై భారత్ చేసిన ప్రతిపాదనల పట్ల చైనా విదేశాంగ మంత్రత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. దీనిపై భారత్‌తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు దీనిపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందాల ప్రకారం.. ఈ ఏడాది వేసవిలో కైలాష్ మానస సరోవర్ యాత్రను పునః ప్రారంభించడంతో పాటు రెండు దేశాల మధ్య 2020 కంటే ముందున్న పరిస్థితులను యధాతథంగా కొనసాగించడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, సామాజిక, రాజకీయ, ఆర్థికవేత్తలు, జర్నలిస్టులకు విసా జారీ ప్రక్రియను సులభతరం చేయడం.. వంటివి ఈ ఒప్పందాల్లో ఉన్నాయి.
ఫలితంగా ఈ ఏడాది వేసవిలో తొలి విమాన సర్వీసు కైలాష్ మానస సరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కేంద్ర పర్యాటక మంత్రత్వ శాఖ- విదేశాంగం సంయుక్తంగా నిర్వహిస్తాయి. విసాలను చైనా ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications