కాట్రగడ్డ అరుణ, సుహాస్, ప్రమీల: అమెరికా ఎన్నికల్లో మనోళ్ల హవా మామూలుగా లేదబ్బా
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి గవర్నర్ పీఠాల వరకు పలువురు నేతలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున నిలిచిన ఇండో-అమెరికన్ ప్రతినిధులు పలు స్థానాల్లో ఘన విజయాలు సాధించారు. మరికొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యతతో కొనసాగుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఒకరిద్దరికి పరాజయాలు కూడా తప్పలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలోని చివరి రెండేళ్ల పాలనలో కాంగ్రెస్‌పై ఏ పార్టీకి నియంత్రణ ఉంటుందో తేల్చేందుకు ఈ మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, సెనేట్, 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఓటింగ్ జరిగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత సంతతికి చెందిన ప్రతినిధులు సాధిస్తున్న విజయాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది.

- ఈ ఎన్నికల్లో వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సుహాస్ సుబ్రమణ్యం ఘన విజయాన్ని సాధించారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. 40 ఏళ్ల సుహాస్ తన సమీప రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్పై 61 శాతానికి పైగా ఓట్లను సాధించి స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వైట్ హౌస్ లో టెక్నికల్ పాలసీ అడ్వైజర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
- ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి పియా దాండియా కూడా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. రిపబ్లికన్ ప్రత్యర్థి కేసీ అస్ కార్‌పై 51.9 శాతం ఓట్లతో ఆమె విజయం సాధించారు. గతంలో న్యూయార్క్‌లోని హార్లెమ్ లో హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేశారు. మొదటిసారి ఆమె యూఎస్ కాంగ్రెస్ లో అడుగుపెట్టబోతున్నారు.
- ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేసిన భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి చేదు అనుభవం ఎదురైంది. డెమొక్రాటిక్ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిజిషియన్ అయిన అమీ యాక్టన్ గెలుపుతో ఒహియోలో 2006 తర్వాత మళ్లీ ఒక డెమొక్రాటిక్ అభ్యర్థి గవర్నర్‌గా ఎన్నికైనట్లయింది.
- ఈ ఎన్నికల్లో తెలుగు మూలాలు ఉన్న కాట్రగడ్డ అరుణ మిల్లర్ ఘన విజయం సాధించారు. మేరీల్యాండ్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఆమె ఎన్నికయ్యారు. ప్రస్తుత గవర్నర్ వెస్ మూర్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్యానెల్ మళ్లీ గెలవడంతో ఆమె వరుసగా రెండోసారి ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిందని, ఓటర్లు తమ పాలనకు పట్టంకట్టారని విజయోత్సవ సమావేశంలో అరుణా మిల్లర్ ఆనందం వ్యక్తం చేశారు.
- ఏపీలో జన్మించిన అరుణా మిల్లర్.. ఏడేళ్ల వయస్సులోనే కుటుంబంతో సహా అమెరికాకు వలస వెళ్లారు. మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె మాంట్గోమెరీ కౌంటీ రవాణా శాఖలో దాదాపు 25 సంవత్సరాల పాటు ఇంజినీర్‌గా పని చేశారు. ఆ సమయంలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రజా రవాణా ఆధునికీకరణపై దృష్టి సారించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని అధిరోహించిన మొట్టమొదటి ఇండో-అమెరికన్ మహిళగా అరుణా మిల్లర్ రికార్డు నెలకొల్పారు.
- కాలిఫోర్నియా 17వ డిస్ట్రిక్ట్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తన ప్రత్యర్థి, భారత సంతతి రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టండన్‌పై 35 వేల కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- వాషింగ్టన్ 7వ డిస్ట్రిక్ట్ నుంచి బరిలో ఉన్న ప్రమీలా జయపాల్ తన సమీప రిపబ్లికన్ ప్రత్యర్థి నీరవ్ సేఠ్ పై 1.5 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
- కాలిఫోర్నియా 3వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ పడుతున్న అమి బెరా 25,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా పయనిస్తున్నారు.
- అరిజోనా 1వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన మాజీ స్టేట్ రిప్రజెంటేటివ్, డాక్టర్ అమిష్ షా కూడా డెమొక్రాటిక్ అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. అమిష్ షా మాజీ ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్. డొనాల్డ్ ట్రంప్ మద్దతు పొందిన రిపబ్లికన్ అభ్యర్థి జే ఫీలీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
- టెక్సాస్ నుంచి సెనెట్ కు పోటీ చేసిన పూజా సేథీ, సందీప్ శ్రీవాస్తవలతో పాటు లాస్ ఏంజిల్స్ మేయర్ పదవికి పోటీ పడుతున్న నిత్య రామన్ వంటి నేతల ఫలితాల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
