విజయవాడ బరిలో ఏబీకి బ్రేక్ పడింది అక్కడే, డిపాజిట్ గల్లంతు..!!
విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా విజయం సాధించారు. భారీ మెజార్టీ దక్కించుకున్నారు. త్రిముఖ పోరుగా భావించిన విజయవాడ మేయర్ ఎన్నిక.. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. విజయవాడలో చివరి నిమిషంలో అనూహ్యంగా ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగారు. దీంతో.. అందరూ విజయవాడ ఫలితం వైపు ఆసక్తిగా చూసారు. అయితే, ఏబీ అంచనాలు తల కిందులు కావటం వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
విజయవాడ కార్పోరేషన్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధా పోటీ చేయడంతోపాటు.. మరోవైపు.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఫలితం పైన ఆసక్తి నెలకొంది. రాజకీయ- సామాజిక సమీకరణాలతో ఫలితం పైన భిన్న అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, తుది ఫలితాలు మాత్రం ఆసక్తిగా ఉన్నాయి. కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకి మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. 1,30,872 మెజార్టీ లభించింది. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. కమ్యూనిస్టులు తోడైనప్పటికీ డిపాజిట్ కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం నేత బాబూరావుకు 29,333 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఏబీవీకి వామపక్షాల ఓట్లు కూడా బదిలీ కాలేదనేది స్పష్టం అవుతోంది.

ఏబీ బరిలో దిగే సమయంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కూటమి అభ్యర్థికి ఆయన గట్టిపోటీ ఇస్తారని అందరూ భావించారు. దీనికి తోడు సామాజిక పరంగా నూ మద్దతు లభిస్తుందని అంచనా వేసారు. అయితే.. ఆ తరహాలో సామాజిక వర్గాల వారీగా ఓట్లు పోల్ కాలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాధాను గెలిపించుకోవటంతో పాటుగా ఏబీ వైపు తమ మద్దతు దారులు చూడకుండా నియంత్రణలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలింగ్ శాతం తగ్గటం కూడా ఏబీవీకి ఓట్లు తక్కువగా రావటానికి మరో కారణంగా చెబుతున్నారు. వైసీపీ సంప్రదాయ ఓట్ బ్యాంక్ భాగ్యలక్ష్మీ వైపే నిలిచారు. ఏబీ ఎన్నికల ప్రచారంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు, పన్నుల భారం తగ్గింపు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు పొందగలనన్న విశ్వాసంతో ప్రచారం సాగించారు. అయితే, ప్రచారంలో వ్యక్తమైన ఉత్సాహం ఓటింగ్‌లో కనిపించలేదు. ఇవన్నీ బాగానే ఉన్నా.. స్థానిక ఎన్నికల్లో కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ లో ఏబీ టీం వెనుకబడింది. దీంతో.. ఇవన్నీ కలిసి ఏబీ అంచనాలను ఫలితం లో తారు మారు చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
