భారత్ చేతికి రష్యా బ్రహ్మాస్త్రం.. 2026 నాటికి S-400 డెలివరీ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో దాయాదికి చుక్కలు చూపించింది ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. యుద్ధ సమయంలో పాకిస్థాన్ భారత్ పై సంధించిన డ్రోన్ లు, క్షిపణులను ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పటికే రష్యా నుంచి నాలుగు ఎస్-400 రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక చివరి డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ వచ్చే ఏడాదికి పూర్తి చేయనున్నట్లు రష్యా నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఈ విషయాన్ని రష్యా మీడియా సంస్థ TASS ధ్రువీకరించింది.
భారత్, రష్యా మధ్య 2018 లో 5.5 బిలియన్ డాలర్లు ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్తం ఐదు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ లను భారత్ కు అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు అందజేయగా.. 2026 నాటికి చివరి డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ను అందించనుంది. ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వేళ ఎస్-400 ప్రపంచ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ డ్రోన్ లు, క్షిపణులపై విరుచుకుపడింది.

ఇక S-400 ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఈ రక్షణ వ్యవస్థ ఉపరితలం నుండి గాలిలోని క్షిపణులపై దాడి చేస్తుంది. దీన్ని రష్యాకు చెందిన అల్మాజ్-ఆంటె అనే కంపెనీ రూపొందించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ గా ఉంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ట్రాక్ చేసే సత్తా ఈ క్షిపణికి ఉంది. అంతేకాక 5 మీటర్ల నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.












Click it and Unblock the Notifications