
ఓమిక్రాన్ కేసుల కలకలం: విదేశీ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
జెరూసలేం: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. దీంతో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే మూడు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూడటంతో మరింత అప్రమత్తమైంది. తాజాగా, ఇజ్రాయెల్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలకు ఉపక్రమించింది.
కరోనా నివారణలో భాగంగా ఆదివారం సాయంత్రం నుంచి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ప్రత్యేక కేసులు మినహా విదేశీ పౌరులకు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశంపై నిషేధం ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి అది అమల్లోకి వస్తుందని తెలిపింది.

విదేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ప్రవేశానికి అనుమతి ఉంది. అయితే, వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీరిలో వ్యాక్సినేషన్ పూర్తయినవారు మూడు రోజులు, కానివారు ఏడు రోజులు క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
కాగా, కరోనా వ్యాప్తి కారణంగా సుదీర్ఘకాలంగా నిలిపివేసిన తన అంతర్జాతీయ రాకపోకలను ఇజ్రాయెల్ ప్రభుత్వం నెల రోజుల క్రితమే పునరుద్ధరించింది. ఇంతలోనే మలావి నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఓమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరిలోనూ ఈ వేరియంట్ వెలుగుచూసింది. దీంతో ఈ ముగ్గురిని క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో పరీక్షల కోసం కోటి ఆర్టీపీసీఆర్ కిట్లను ఆర్డర్ పెట్టనున్నట్లు చెప్పారు ఇజ్రాయెల్ అధికారులు. 90 లక్షలుగా ఉన్న ఈ దేశ జనాభాలో ఇప్పటి వరకు దాదాపు 50.7 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. కాగా, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ సహా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆప్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కట్టడి విధిస్తున్నాయి. ఆప్రికా దేశాల నుంచి వస్తున్నవారిని పరీక్షించి, క్వారంటైన్లో పెడుతున్నాయి. తాజాగా, న్యూజిలాండ్ కూడా 9 ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు విధించింది. థాయ్ లాండ్ కూడా ఆఫ్రికా పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. కాగా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా మూడు, రెండు ఓమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి.