Burqa Ban: స్కూళ్లలో బుర్ఖాలపై బ్యాన్.. ప్రధాని మెలోని సంచలనం!
ఇటలీలో విద్యావ్యవస్థ, సాంస్కృతిక నిబంధనలపై ప్రధాని జార్జియా మెలోని తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పాఠశాలల్లో ముఖం కనిపించకుండా వేసుకునే బుర్ఖా, నిఖాబ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అంతేకాకుండా విదేశీ విద్యార్థుల సంఖ్యపై కూడా పాఠశాలల తరగతుల్లో పరిమితులు విధించేలా నూతన చట్టాన్ని తీసుకురాబోతున్నారు. రోమ్‌లో జరిగిన తన పార్టీ 'బ్రదర్స్ ఆఫ్ ఇటలీ' యువజన విభాగం సదస్సులో మాట్లాడిన ప్రధాని మెలోని, త్వరలోనే ఈ ప్రతిపాదనలను కేబినెట్ ముందుకు తీసుకువచ్చి చట్టబద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై క్యాప్
ఒకే తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఎక్కువైతే వారు స్థానిక భాషను, సంస్కృతిని నేర్చుకోవడంలో వెనుకబడిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. తరగతిలో ఒకరో ఇద్దరో విదేశీ పిల్లలు ఉంటే తోటి విద్యార్థుల సాయంతో త్వరగా ఇటాలియన్ భాష నేర్చుకుని కలిసిపోతారని, కానీ వారి సంఖ్య మెజారిటీ స్థాయికి చేరితే అది అనుసంధానం కాదని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా మారుతుందని మెలోని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఉండాల్సిన విదేశీ విద్యార్థుల గరిష్ట సంఖ్యపై స్పష్టమైన పరిమితి విధించనున్నారు.

మాతాపిత్రులకూ ఇటాలియన్ భాష తప్పనిసరి
కేవలం విద్యార్థులే కాకుండా, ఇటలీ సమాజంలో త్వరగా కలిసిపోలేకపోతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఇటాలియన్ భాషను నేర్చుకోవాలనే నిబంధనను తీసుకువస్తున్నారు. ఇటలీకి వచ్చి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ఎవరైనా సరే.. తమ దేశ భాషను నేర్చుకోవాలని, సంస్కృతిని అర్థం చేసుకుని చట్టాలను గౌరవించాలని మెలోని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా స్వాగతించడానికి ఇదే సరైన విధానమని ఆమె పేర్కొన్నారు.
ముఖం తెరిచే స్కూళ్లకు రావాలి!
సంప్రదాయాల పేరుతో ముఖాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులపై ప్రధాని మెలోని తీవ్ర స్థాయిలో స్పందించారు. "ఎవరైనా సరే ముఖం తెరిచే పాఠశాలలకు రావాలి. ఒక యువతి తన ముఖాన్ని దాచుకోవాలని ఆదేశించే హక్కు ఏ సంప్రదాయానికీ లేదు" అని ఆమె స్పష్టం చేశారు. ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా, నిఖాబ్‌ల పైనే ఈ నిషేధం వర్తిస్తుందని, అయితే కేవలం తలను కప్పే హిజాబ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లు చట్టంగా మారడానికి 60 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications
