9/11: రెస్క్యూ డాగ్ 16వ బర్త్‌డే వేడుక(వీడియో)
న్యూయార్క్: 9/11దాడి రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న 100 కుక్కల్లో ఓ కుక్క ఇటీవల తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. న్యూయార్క్ వాసుల హృదయాలను గెలుచుకున్న ఆ కుక్క పేరు బ్రెటగ్నే(బ్రిట్నీ). దాడి తర్వాత జీవించి ఉన్న రెస్క్యూ డాగ్ ఇదే కావడం గమనార్హం.
ఆ కుక్క 16వ పుట్టిన రోజును న్యూయార్క్‌లో జరుపుకునేందుకు ఆ కుక్కను తీసుకుని దాని యజమాని టెక్సాస్ నుంచి న్యూయార్క్ వచ్చారు. బ్రిట్నీ అందించిన సేవలకు గాను పోలీసు అధికారులు దాని పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు.
బార్క్‌పోస్ట్ బృందం ఆ కుక్క, దాని యజమాని డెనీస్ కార్లీస్‌కు గొప్ప ఆతిథ్యమిచ్చారు. సెంట్రల్ పార్క్‌లో బ్రిట్నీకి అధికారిక దుస్తులు ధరింపజేశారు. ఆ తర్వాత దాన్ని నగరంలో తిప్పారు.
కుక్క పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కేక్‌ను కూడా కట్ చేశారు. ఈ వేడుకలకు చాలా మంది అతిథులు హాజరయ్యారు. అంతేగాక, అనేకమంది ఆ కుక్క పేరున శిక్షణ తీసుకుంటున్న ఇతర కుక్కలకు విరాళాలు ప్రకటించారు.
బ్రిట్నీ దాదాపు 10 సంవత్సరాలపాటు రెస్క్యూ టీంలో సేవలందించింది. ప్రస్తుతం రిటైరైన బ్రిట్నీ.. అప్పుడప్పుడు శిక్షణ ఇచ్చే పాఠశాలకు వచ్చిపోతూ ఉంటుంది. ఇతర కుక్కలకు మార్గదర్శనం చేస్తుంది కూడా.












Click it and Unblock the Notifications