వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుసకొడుతున్న బానిసత్వం.. నలుగురికొకరు బాలలే

అది మనిషి స్వేచ్ఛను దారుణంగా హరించే వికృత పోకడ.. తోటి మనిషిని నిలువునా దోచుకునే అరాచక సంప్రదాయం బానిసత్వం. ఈ దురాచారం అనాదిగా కొనసాగుతూనే ఉన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అది మనిషి స్వేచ్ఛను దారుణంగా హరించే వికృత పోకడ.. తోటి మనిషిని నిలువునా దోచుకునే అరాచక సంప్రదాయం బానిసత్వం. ఈ దురాచారం అనాదిగా కొనసాగుతూనే ఉన్నది. కానీ ఆధునిక సమాజ ఛాయల నుంచీ దూరం కాలేదని, అది ఇప్పటికీ తాండవిస్తూనే ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

2016లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని నిగ్గు తేలింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) నిర్ధారించిన చేదు నిజాలివి. ఇప్పటికీ బాలకార్మిక వ్యవస్థ పలు చోట్ల వేళ్లూనుకుని ఉన్నది. ప్రమాదకర వృత్తుల్లో బాల్యం బలైపోతున్నది.

మహిళలు, బాలికలు శారీరకంగా, లైంగికంగా దారుణంగా దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా వ్యభిచార వృత్తిలో ఇది మరీ విశృంఖలంగా ఉంది. వలసలపై ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ (ఐఓఏం) భాగస్వామ్యంతో ఐఎల్‌ఓ, 'వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌' సంయుక్తంగా జరిపిన పరిశోధనలో విస్మయ పరిచే వాస్తవాలు బయటపడ్డాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 72వ వార్షిక సమావేశంలో ఈ గణాంకాలను బహిర్గతం చేశారు. 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారు. మొత్తం 4 కోట్ల మంది బానిసల్లో మహిళలు ప్లస్ బాలికల శాతం 71. మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే ఆధునిక బానిసల్లో 25 శాతం మంది.. ప్రతి నలుగురికి ఒకరు బాలలే ఉండటం గమనార్హం. సేవల రంగంలో ప్రతి ఐదుగురు బాలల్లో ఒకరు బానిసలుగా పని చేస్తున్నారు.

ఇష్టానికి విరుద్దంగా వివాహాలతో 57 లక్షల మంది జీవితాలు నాశనం

ఇష్టానికి విరుద్దంగా వివాహాలతో 57 లక్షల మంది జీవితాలు నాశనం

ఆధునిక బానిసలైన నాలుగు కోట్ల మందిలో.. తమ అభీష్టానికి విరుద్ధంగా బలవంతంగా కార్మికులు మారిన వారు, తమ సమ్మతి లేకుండానే బలవంతంగా పెళ్ళిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులు, గ్రూపులు కలిసి దాదాపు 2.5 కోట్ల మందిని ఇళ్లలో, నిర్మాణ ప్రదేశాల్లో, ఫ్యాక్టరీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, చేపలు పట్టే పడవల్లో బలవంతంగా పనిలోకి దించారు. వీరిలో 1.6 కోట్ల మంది ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు. మరో 48 లక్షల మంది బలవంతపు లైంగిక దోపిడీకి గురయ్యారు. అధికార యంత్రాంగాల బలవంతం, ఒత్తిళ్ల కారణంగా మరో 41 లక్షల మంది కార్మికులుగా మారారు. ఇలా మారిన వారిని సైనిక, పారామిలిటరీ, ప్రజాపనుల్లాంటి వాటికి వినియోగించారు.

ప్రైవేట్ వ్యక్తులు కొందరిని కట్టుబానిసలుగా మార్చుకోగా, మరికొందరిని ఇళ్లలో పనికి కుదుర్చుకున్నారు. పలువురు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. ఇలా బలైన వారిలో బాలికలు ఎక్కువమంది ఉన్నారు. వ్యభిచారిణులుగా మారి లైంగిక జీవితంపై స్వతంత్రతను కోల్పోయిన దాదాపు 1.5 కోట్ల మందిని వారి ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా పెళ్లిచేసిన దృష్టాంతాలు బయటపడ్డాయి. ఇలాంటి వారిలో దాదాపు 57 లక్షల మంది పిల్లలు. ఆధునిక బానిసత్వంలో అత్యధికంగా నష్టపోయింది మహిళలు, బాలికలే. వ్యభిచారం వ్యాపార పరిశ్రమగా మారిన చోట వీరు దారుణంగా దోపిడీకి గురయ్యారు. మొత్తంగా 50 శాతం మంది బలవంతపు కార్మికులుగా మారి.. ప్రైవేట్ రుణదాతల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

 ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోనే బాల కార్మికులు అధికం

ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోనే బాల కార్మికులు అధికం

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా ఈ వృత్తి ఇంకా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. 5 - 17 ఏళ్ల మధ్యనున్న బాలలు దాదాపు 26.4 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ పనుల్లో కొనసాగుతున్నారు. వీరిలో దాదాపు 8.5 కోట్ల మంది అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నారు. బాలల్ని బలవంతంగా సాయుధ పోరాటాల్లో వినియోగించుకోవడం, అక్రమ కార్యకలాపాలాకు వినియోగించడం, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి.

ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్ని సహారా ప్రాంత ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా ఆక్రమిస్తాయి. 2000తో (17.1 కోట్ల మంది) పోల్చుకుంటే.. 2012 నాటికి అత్యంత ప్రమాదకర వృత్తుల్లో కొనసాగే బాలల సంఖ్య 8.5 కోట్ల మందికి తగ్గడం కొంత ఆశావహ పరిణామమైనా.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అయితే గత ఐదేళ్లలో 8.9 కోట్ల మంది ఏదో ఒక రూపంలో ఆధునిక బానిసత్వానికి బలై పోయారు. బాల కార్మికులు 70.9 శాతం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు.

 విస్తృత పోరాటంతోనే లక్ష్య సాధన సాధ్యమన్న ఐఎల్ఓ

విస్తృత పోరాటంతోనే లక్ష్య సాధన సాధ్యమన్న ఐఎల్ఓ

2030 నాటికి మనుషుల అక్రమ రవాణా, ఆధునిక బానిసత్వ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని(ఎస్‌డీజీలు) నిర్దేశించింది. సమితి ఇందుకోసం అనేక దేశాలతో కలిసి పనిచేస్తోంది. కానీ ఇప్పటికీ తాండవిస్తున్న ఆధునిక బానిసత్వం, బాల కార్మిక వ్యవస్థ ఈ లక్ష్యాలను దారుణంగా నీరుగారుస్తున్నాయి. ఈ దురాచారాలపై విస్తృత పోరాటం చేయకపోతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ హెచ్చరించారు. బలవంతపు కార్మికులు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉందని ఆయన సూచించారు. ప్రభుత్వం, వ్యాపారవర్గాలు, పౌరసమాజం.. ఇలా ప్రతిఒక్కరూ నడుం బిగిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు.

English summary
An estimated 40.3 million people were victims of modern slavery in 2016, a quarter of them children, according to new global slavery statistics released today. The figures, from the UN’s International Labour Organisation (ILO) and the Walk Free Foundation, show 24.9 million people across the world were trapped in forced labour and 15.4 million in forced marriage last year. Children account for 10 million of the overall 40.3m total.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X