పిలిప్పైన్స్‌లో భారీ భూకంపం: 73 మంది మృతి
మనీలా: పిలిప్పైన్స్‌ను మంగళవారం భారీ భూకంపం వణికించింది. మధ్య పిలిప్పైన్స్‌లో ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఇందులో 73 మంది మరణించారు. భూకంపం తాకిడికి భవనాలు కూలిపోయాయి. చర్చిలు నేలకూలాయి. భయాందోళనలతో ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.
భూకంపం తాకిడికి బోహోల్ దీవిలో 57 మంది మృత్యువాత పడ్డారు. దాని పరిసరాల్లో గల సిబూ, సిక్వాజోర్ దీవుల్లో 16 మంది మరణించినట్లు జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. భవనాలు, చర్చిలు కూలి పడడంతో రోడ్లు మూసుకుపోయాయి.

మంగళవారం ఉదయం 8 గంటల 12 నిమిషాలకు భూకంపం పిలిప్పైన్స్ ప్రజలను భీతావహులను చేసింది. సిబూలో పెద్ద యెత్తున విధ్వంసం జరిగింది. బోహోల్ దీవిలో చాలా భవనాలు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి. వంతెనలు కూలిపోయాయి.
భవనం నుంచి తాము బయటకు పరుగులు తీశామని, అయితే తమకు అడ్డంగా చెట్లు కూలిపడ్డాయని బోహోల్‌లోని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉద్యోగి చెప్పారు. కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసేశారు. జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications