బిగ్ షాక్ : పారిస్ మ్యూజియంలో భారీ చోరీ..!
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ చోటు చేసుకుంది. మెసపటోమియా, ఈజిప్టు సహా పలు రాజ్యాలకు చెందిన అనేక చిత్రాలు, శిల్పాలకు ఈ మ్యూజియం ప్రసిద్ధి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్, వెర్సైల్లెస్ డయానా వంటి అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 30,000 మంది సందర్శకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. కానీ ఇంతటి ప్రఖ్యాతి ప్రదేశంలో దొంగతనం జరిగినట్టు ఫ్రాన్స్ మంత్రి రాచిడా దాతి వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆమె తెలిపారు. ఈ అనూహ్య ఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఈ కారణంగా మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారని మంత్రి దాతి పేర్కొన్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం మ్యూజియంలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రాంతం గుండా దొంగలు లోపలికి ప్రవేశించారని సమాచారం.

కాగా నిర్మాణ స్థలం నుంచి లోపలికి చొరబడిన దుండగులు.. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా అపోలో గ్యాలరీలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న అద్దాలను పగులగొట్టి, తొమ్మిది విలువైన వస్తువులను దొంగిలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు గతంలోనూ లౌవ్రే మ్యూజియంలో అనేక చోరీ ప్రయత్నాలు జరిగాయి. 1911లో మ్యూజియంలో పనిచేసిన మాజీ ఉద్యోగి విన్సెంజో పెరుగ్గియా మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. రెండేళ్ల తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1983లో రెండు పురాతన కవచాలను దొంగలు అపహరించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వాటిని అధికారులు గుర్తించారు.
ఇక ఇప్పుడు మ్యూజియం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం కలిసి దర్యాప్తు ప్రారంభించాయి. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, దొంగల ప్రవేశ మార్గాలు, సహకార నెట్‌వర్క్‌ను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వశాఖ కూడా ఈ కేసును హై-ప్రొఫైల్ దర్యాప్తుగా పరిగణిస్తోంది. కళాఖండాలు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే అవకాశం ఉన్నందున, అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా పర్యవేక్షణ ప్రారంభించాయి.












Click it and Unblock the Notifications