ఎంహెచ్370 మిస్టరీ: హిందూమహా సముద్రంలో శకలం!
కౌలాలంపూర్: మలేసియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ మిస్టరీ ఇంకా వీడలేదు. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఓ వస్తువు తేలియాడుతున్నట్లు చైనా ఉపగ్రహాలు గుర్తించాయి. అది మలేషియా విమాన శకలమై ఉండవచ్చునని భావిస్తున్నారు. పూర్తిగా రెండు వారాలు గడిచిపోయినా విమానం ఆచూకీ తెలియడం లేదు.
నాలుగు రోజుల క్రితం.. పెర్త్ తీరానికి 2500 కిలోమీటర్ల దూరంలో ఏవో శకలాలను కనుగొన్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా కూడా దక్షిణ హిందూ మహాసముద్రంలో ఒక చోట ఏదో పెద్ద వస్తువు నీటిలో తేలుతూ కనిపించిందని తెలిపింది.
అదీ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రాంతానికి పడమరగా 75 మైళ్ల దూరంలో కనిపించినట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా వారికి కనిపించిన వస్తువు తాలూకూ ఉపగ్రహ చిత్రం మార్చి 16 నాటిదైతే చైనీయులు మార్చి 18 నాటి ఉపగ్రహ చిత్రంలో దీన్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అది గల్లంతైన ఎంహెచ్ 370 విమానం తాలూకూ శకలమై ఉంటుందని భావిస్తున్నట్టు మలేసియా ప్రకటించింది.

ఉపగ్రహ చిత్రాల్లో దాన్ని కనుగొన్నట్టు చైనా రాయబారి తమకు తెలిపారని, అదేంటో తెలుసుకోవడానికి ఆ దేశం అక్కడికి రెండు నౌకల్ని పంపిస్తోందని మలేసియా మంత్రి హిషముద్దీన్ తెలిపారు. చైనా కనుగొన్న ఆ వస్తువు 73.8 అడుగుల పొడుగు, 42 అడుగుల వెడల్పు ఉన్నట్టు తెలిపారు.
గల్లంతైన విమానం సముద్రంలో కుప్పకూలిపోయి ఉంటుందనే నిర్ణయానికి వచ్చిన మలేసియా.. దాన్ని వెతకడానికి సముద్రం అడుగున నిఘా వేయడానికి అవసరమైన పరికరాలు సమకూర్చాల్సిందిగా అమెరికాను కోరింది.












Click it and Unblock the Notifications