ఓ తల్లి దారుణం: కన్న కొడుకునే బాత్రూంలో బంధించి..
బ్రాండీ కే జేన్స్(36) అనే ముగ్గురు పిల్లల తల్లి తన పన్నెండేళ్ల కుమారుడిని ఇంటిలోని చిన్న బాత్‌రూమ్‌లో నిర్బంధించి తాళం వేసింది.
అమెరికా: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కుమారుడి పట్ల నిర్దయగా వ్యవహరించింది. 12ఏళ్ల కుమారుడిని ఏడాది కాలంగా బాత్రూంలో నిర్బంధించి సరైన తిండిపెట్టకుండా, బయటి ప్రపంచాన్ని చూడనివ్వకుండా కఠినాత్మురాలిగా ప్రవర్తించింది.
పశ్చిమ అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఈ ఘటన వెలుగుచూసింది. బ్రాండీ కే జేన్స్(36) అనే ముగ్గురు పిల్లల తల్లి తన పన్నెండేళ్ల కుమారుడిని ఇంటిలోని చిన్న బాత్‌రూమ్‌లో నిర్బంధించి తాళం వేసింది. ఇటీవలే ఈ విషయం గురించి తెలుసుకున్న బాలుడి తండ్రి కుమారుడిని కాపాడాడు.
ఏడాది కాలంగా నిర్భంధాన్ని అనుభవిస్తున్న ఆ బాలుడు చిక్కి శల్యమైపోయాడు. సరైన తిండి లేకపోవడంతో ప్రస్తుతం అతను కేవలం 30పౌండ్ల బరువు మాత్రమే ఉన్నాడు. పోషకాహార లోపంతో సరిగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. తిరిగి అతను పూర్వపు స్థితికి రావాలంటే కొన్నివారాల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఓ తల్లి కన్న కొడుకు పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన తీరును తాము గతంలో ఎన్నడూ చూడలేదని వైద్యులు అన్నారు. ఆమె ఎందుకిలా చేసిందో తెలియడం లేదని పేర్కొన్నారు. కాగా, బాలుడిని నిర్బంధించిన బాత్రూం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ట్యూబ్ లైట్ వెలుతురు సైతం బాత్రూంలో పడకుండా.. దానిపై టేపు అతికించినట్టు పోలీసులు పేర్కొన్నారు. బయటినుంచి బాత్రూం లోపల ఉన్న బాలుడితో మాట్లాడటానికి అనువుగా ఓ వీడియో కెమెరా అమర్చినట్టు తెలిపారు.
బాలుడి సోదరులు కూడా దీనిపై స్పందించారు. దాదాపు ఆర్నెళ్లుగా తమ సోదరుడితో కనీసం తలుపు దగ్గరి నుంచి కూడా మాట్లాడలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications