పేరెంట్స్ బీ కేర్‌ఫుల్ : ఈ కుర్రాడు మ్యాథ్స్ హోంవర్క్ ఎలా చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు
ఈ రోజుల్లో పిల్లలను పిల్లలు అనడం కన్నా చిచ్చరపిడుగుల అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలు అతి చిన్న వయస్సులోనే ప్రపంచాన్నే చదివేస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పిల్లలు నిజంగానే పిడుగుల్లా మారారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంలోకానీ, ఇతర టెక్నాలజీ డివైసెస్‌పై పనిచేయడం కానీ జెట్‌స్పీడ్‌తో దూసుకెళుతున్నారు. ఎలా అంటే తమ హోంవర్కుల దగ్గర నుంచి తమ సొంత పనులను టెక్నాలజీ వినియోగించి పూర్తి చేసుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారి తన హోంవర్క్ అలెక్సా అనే వర్చువల్ అసిస్టెంట్‌కు చెప్పి చేసుకుంటుండగా తన తల్లికి చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

హోంవర్క్ తొందరగా పూర్తి చేస్తేనే ఆటలు
డిసెంబర్ 26న ప్రముఖ పత్రిక న్యూయార్క్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. ఓ ఆరేళ్ల వయస్సున్న కుర్రాడికి బండెడంత హోంవర్క్ ఇచ్చింది తన క్లాస్ టీచర్. ఈ బుడ్డోడికేమో ఆ హోంవర్క్ త్వరగా పూర్తి చేసి ఆటలాడుకోవాలని ఉంది. తన తల్లి ఏమో హోంవర్క్ పూర్తి చేస్తే కానీ ఆటలకు వెళ్లకూడదని చాలా కఠినంగా చెప్పింది. దీంతో ఆ పిడుగు ఏం చేయాలో అర్థం కాక తన బ్రెయిన్ అప్లై చేశాడు. త్వరగా వెళ్లి ఆడుకోవాలంటే ముందుగా హోంవర్క్ కంప్లీట్ చేయాలి. హోంవర్క్ చూస్తేనేమో చాలా ఉంది. దీంతో ఈ చిచ్చరపిడుగు వెంటనే అమెజాన్ రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్‌కు పని చెప్పాడు.
లెక్కలు పూర్తి చేసేందుకు వర్చువల్ అసిస్టెంట్ సాయం తీసుకున్న కుర్రాడు
ఈ కుర్రాడు ముందుగా మ్యాథ్స్ హోంవర్క్ మొదలు పెట్టాడు. ముందుగా 5 లోనుంచి 3 తీసేస్తే ఎంత అని వర్చువల్ అసిస్టెంట్ అలెక్సాను ఈ కుర్రాడు అడిగాడు. ఇది రెండు అని సరైన సమాధానం ఇచ్చింది. దాన్నే బుక్‌లో రాశాడు కుర్రాడు. అంతేకాదు జవాబు చెప్పిన అలెక్సాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. అదే సమయంలో ఎక్కడో వంటింట్లో ఉండే ఆ కుర్రాడి తల్లి ఇది వినింది. మ్యాథ్స్ అనేది సొంతంగా చేయాలని ఇలాంటి పరికరాలవల్ల కుర్రాడు ప్రాక్టీస్ చేయడం మానేస్తున్నాడని తల్లి పేర్కొంది. పార్ట్‌కట్లను అనుసరిస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడుతాడని ఆమె పేర్కొంది.

షార్ట్‌కట్‌లో లెక్కలు చేయడం వల్ల మెదడు మొద్దుబారి పోతుందని: తల్లి ఎర్లిన్
ఈ వీడియోను తల్లి ఎర్లిన్ తన ట్విటర్‌లో పోస్టు చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. కుర్రాడు చేసిన తప్పుకు ఇప్పుడే దండించాలా లేక తరువాత దండించాలా అనే ఆప్షన్ నెటిజన్లకే వదిలేసింది ఎర్లిన్. అలెక్సా ఇలా తన కొడుకుకు సహాయం చేయడం ఇష్టం లేదని తల్లి ఎర్లిన్ పేర్కొంది. ఇలా చేయడం వల్ల తన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడంలో మెదడు ఉపయోగించడం మానేస్తే అది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇకపై అలెక్సా డివైస్‌ను స్విచ్ఛాఫ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇలా చేస్తే తన సొంత పని కుర్రాడే చేసుకుంటాడని వెల్లడించింది. అంతేకాదు పిల్లలను ఇలాంటి పరికరాల నుంచి దూరంగా ఉంచాలని ఇతర తల్లిదండ్రులకు సూచించింది ఎర్లిన్.