సొంత ప్రజల పైనే బాంబులతో సైన్యం దాడి.. 24 మంది దుర్మరణం!
మయన్మార్‌లో మరోసారి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. బౌద్ధ ఉత్సవం సందర్భంగా గుమిగూడిన సొంత ప్రజలపైనే సైన్యం దాడికి పాల్పడింది. సైన్యంల మోటార్ పవర్‌తో నడిచే పారాగ్లైడర్ ద్వారా జనసమూహంపై రెండు బాంబులు విసరడంతో దాదాపు 24 మంది మృతి చెందగా.. 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన మయన్మార్ చౌంగ్ యూ టౌన్‌షిప్‌లో జరిగింది. మయన్మార్ ప్రవాస నేషనల్ యూనిటీ గవర్నమెంట్(NUG) అధికార ప్రతినిధి ఈ దాడి వివరాలను వెల్లడించారు.
పారాగ్లైడర్ ద్వారా బాంబుల వర్షం
జాతీయ సెలవుదినంగా భావించే, బౌద్ధంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన థాడింగ్యూట్ ఉత్సవాన్ని జరుపుకోవడానికి చాలా మంది ప్రజలు సమావేశమయ్యారు. ఈ ఉత్సవంలో భాగంగా సైనిక విధానాలకు వ్యతిరేకంగా దీపాల వెలుగులతో ఓ నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సమయంలో మోటార్‌తో నడిచే ఓ పారాగ్లైడర్ ఆ గుంపుపైకి వచ్చి రెండు బాంబులు వేసినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.

పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) అధికారి ఒకరు మాట్లాడుతూ.. థాడింగ్యూట్ ఉత్సవంలో వైమానిక దాడి జరగవచ్చనే సమాచారం తమకు అందిందని చెప్పారు. తమ బృందం నిరసనను ముగించడానికి అక్కడికి చేరుకునేలోపే, పారామోటర్లు చేరుకుని కేవలం ఏడు నిమిషాల్లో రెండు బాంబులు వేసినట్లు ఆయన తెలిపారు. దాడికి గురైన ఓ అధికారి, "మొదటి బాంబు పడినప్పుడు నేను నేలపై పడిపోయాను, కానీ అది నా మోకాలి కింది భాగానికి తగిలింది. నా దగ్గర ఉన్న కొందరు అక్కడికక్కడే చనిపోయారు" అని వివరించారు.
నాలుగేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం
మయన్మార్‌లో 2021లో సైన్యం తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 5,000 మందికి పైగా పౌరులు మరణించారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. సైన్యం విమానాలు, హెలికాప్టర్ల కొరత కారణంగా, ఇటీవల పౌరులపై దాడులకు పారామోటర్లను ఉపయోగించడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. సంఘాలపైనా దాడులకు సైన్యం మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించడం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడులు సైన్యం తమ సొంత ప్రజలపై చూపుతున్న అమానవీయతకు అద్దం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications