ఆర్టెమిస్-1 మరో సారి వాయిదా : అసలు కారణం ఇదేనా..!!
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయోగం ఇప్పటికే గత నెల 29న వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో..మరోసారి దీనిని ప్రయోగించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు చేసారు. కానీ, మరోసారి ఇది వాయిదా పడింది. రాకెట్‌లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
ఇంజిన్ నంబర్-3లో లీకేజీ సమస్య వల్ల రాకెట్ లాంఛ్‌ను తొలుత వాయిదా పడింది. తిరిగి సెప్టెంబర్ 3న ప్రయోగిస్తున్నట్లు వెల్లడించగా ఇప్పుడూ సాంకేతిక కారణాలతో సాధ్య పడలేదు. అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏళ్లకు మరోసారి చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది.

ఆగస్టు 29న ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను ఉంచారు. లాంచ్‌పాడ్‌ను ఐదు పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్ క్యాప్సూల్‌కు ఎటువంటి డామేజ్ జరగలేదు. ఇక, రెండో సారి ప్రయోగం వాయిదా వెనుక సాంకేతిక కారణాలే ప్రధానంగా చెబుతున్నారు.
లాంఛ్ సిస్టమ్ రాకెట్‌లో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. రిహార్సల్స్ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తేల్చారు. దీంతో.. వాల్వ్లోనూ లీకేజీలు వచ్చాయి. నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు..లీకులు ఉండటంతో చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా వేసినట్లు సమాచారం. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా వెల్లడించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications