Viral Video: వరదల్లో కొట్టుకొస్తున్న గ్యాస్ సిలిండర్ల కోసం ప్రాణాలకు తెగించి మరీ..!
భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ లో ఆకస్మికంగా సంభవించిన వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 359 దాటినట్లు నేపాల్ అధికార యంత్రాంగం వెల్లడించింది. దాదాపు 910 మంది ఆచూకీ గల్లంతైందని.. గల్లంతైన వారిలో 288 మంది భారత పర్యటకులు ఉన్నారని వివరించింది. ఇక నేపాల్ భారీ వరదలు, బురద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు, పలు వంతెనలు నామరూపాల్లేకుండా పోయాయి. అనేక చోట్ల భారీ ఎత్తున బురద పేరుకుపోయింది. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
అయితే నేపాల్ వరదలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అక్కడ నెలకొన్న గ్యాస్ సంక్షోభం పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వైపు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపాల్ వాసులకు గ్యాస్ కొరత మరింత వేధిస్తోంది. నేపాల్ లో సంభవించిన వరదల కారణంగా త్రిశూలి నదిలో కొట్టుకొస్తున్న గ్యాస్ సిలిండర్లు, ఇతర వస్తువులను దక్కించుకునేందుకు ప్రజలు ప్రాణాలకు తెగించి నదిలోకి దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ విపత్తును అవకాశంగా మలచుకొని, పొంగిపొర్లుతున్న నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే సామాగ్రిని సొంతం చేసుకోవడానికి ఈ ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం అత్యంత నిర్లక్ష్యమని, ఇది చాలా ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా రెండు సిలిండర్లను భుజాలపై మోసుకెళ్తుండగా.. మరికొందరు వాటి కోసం గొడవపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక నేపాల్ లో పలు కారణాలతో చాలా కాలంగా గ్యాస్ సంక్షోభం ఉన్నట్లు సమాచారం అందుతోంది. విపరీతమైన గ్యాస్ కొరత కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల రోజువారీ జీవితం ఛిద్రమైంది. ఒక్క సిలిండర్ కోసం ప్రజలు గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం.. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు కూడా నేపాల్ లో ఈ పరిస్థితికి కారణం అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications