ది లాస్ట్ మొనార్క్ ఆఫ్ నార్వే కన్నుమూత: మొన్నే ప్రధాని మోదీ భేటీ
దాదాపు ముడున్నర దశాబ్దాల పాటు నార్వేను పాలించిన కింగ్ మొనార్క్ హరాల్డ్- 5 న్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత ఆనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఓస్లో నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నార్వే కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6:35 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆధునిక నార్వేకు చిట్టచివరి మొనార్క్ గా ఆయన పేరుంది.
ఆయన కన్నుమూసిన విషయాన్ని నార్వే రాజకుటుంబం అధికారికంగా వెల్లడించింది. సంతాప సూచకంగా హరాల్డ్ ప్యాలెస్ అధికారిక వెబ్‌సైట్ ను బ్లాక్ కలర్‌లోకి మార్చారు. ఆయనకు నివాళి అర్పిస్తోన్న ఫొటోను వెబ్‌సైట్ లో పొందుపరిచింది. ఈ నెల 17వ తేదీన హరాల్డ్ ఓస్లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. హీమోలిటిక్ అనీమియా, కార్టిసోన్ థెరపీ కారణంగా శరీరంలో నీరు చేరడం వంటి అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు.

హీమోలిటిక్ అనీమియా బారిన పడ్డ వారి శరీరంలోని ఎర్ర రక్త కణాలు.. తయారయ్యే వేగం కంటే చాలా వేగంగా నశించిపోతాయి. దీనివల్ల బాధితుడిలో రోగ నిరోధక శక్తి విపరీతంగా క్షీణిస్తుంది. డాక్టర్లు ఆయనకు కోర్టిసోన్ థెరపీని అందించినప్పటికీ లాభం లేకపోయింది. ఎర్రరక్త కణాలు క్షీణించడం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరింది.
చికిత్స పొందుతున్న సమయంలో రక్తంలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ మరింతగా ప్రబలింది. దీనితో ఆయన ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. హరాల్డ్ తుదిశ్వాస విడిచే సమయంలో ఆయన భార్య క్వీన్ సోనియా, పిల్లలు ఆయన వద్దే ఉన్నారు. నార్వే రాజ్యాంగం ప్రకారం.. ఆయన కుమారుడు క్రౌన్ ప్రిన్స్ హాకన్ తదుపరి కింగ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అధికార బదిలీని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ పర్యవేక్షిస్తుంది. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ మరణవార్త తెలిసిన వెంటనే నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గార్ స్టోర్ తన జర్మనీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని, ఓస్లోకు చేరుకున్నారు. హరాల్డ్ కన్నుమూశారనే విషయం తెలియడంతో వందలాది మంది పౌరులు ఆసుపత్రి ప్రాంగణం, అలాగే రాయల్ ప్యాలెస్ వెలుపల గుమిగూడారు. ఆయన చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి, నివాళి అర్పిస్తోన్నారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించే అవకాశం ఉందని నార్వే తెలిపింది.
తండ్రి కింగ్ ఒలావ్ 5 మరణానంతరం 1991లో రాజుగా బాధ్యతలను స్వీకరించారు హరాల్డ్. ఆధునిక నార్వే నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు సెయిలర్ గా పని చేశారు. ఒలింపిక్స్‌లో నార్వేకు ప్రాతినిధ్యాన్ని వహించారు. 1987లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెయిలింగ్ విభాగంలో స్వర్ణం సైతం సాధించారు హరాల్డ్. రాజుగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సెయిలింగ్ కు పుల్ స్టాప్ పెట్టారు.
భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నార్వే పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది మే 18న ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నారు కూడా. ఓస్లో రాజకుటుంబం ప్యాలెస్ లో ఈ భేటీ ఏర్పాటైంది.














Click it and Unblock the Notifications