ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే
వాషింగ్టన్: అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులు, ఇతర విదేశీయులకు దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీపి కబురు అందించారు. వారందరికీ ఆమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి వీలుగా చట్టబద్ధత కల్పించారు. తద్వారా ఇప్పటికిప్పుడు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన సంకట పరిస్థితి ఎదురు కాకుండా చూశారు.
అమెరికా చరిత్రలోనే ఎన్నడు లేనివిధంగా వలస విధానంలో సమూల మార్పులకు ఒమాబా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. దీనిని వ్యతిరేకిస్తున్న అమెరికా చట్ట సభలను పక్కన పెట్టి మరీ తనకున్న కార్యనిర్వాహక అధికారాలల్ని ఉపయోగించి ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల దాదాపు నాలుగున్నర లక్షల మంది భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశముంది.
గ్రీన్ కార్డ్‌గా పేరొందిన శాశ్వత చట్టబద్ధ హోదా కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్-1బీ వీసా ఉన్న వారికి, వారి భార్య లేదా భర్తకు, అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తుల తల్లిదండ్రులకు తాజా నిర్ణయం వల్ల తాత్కాలికంగా నివసించేందుకు, ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది.

గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇక మీదట సులభంగా వెంట తీసుకు వెళ్లగల వర్క్ పర్మిట్ లభించనుంది. దీనివల్ల అమెరికాలో ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడం, ఉద్యోగాలు మారటం సులభం అవనుంది. అమెరికాలో ఐదేళ్లుగా ఉంటున్న వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర వేడుకలకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఒబామా శుక్రవారం అంగీకరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 2015 జనవరిలో ఒబామా భారత్‌లో పర్యటించి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమాచార కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.
భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గౌరవం అమెరికా అధ్యక్షుడికి లభించడం ఇదే తొలిసారి అని, అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బరాక్ ఒబామా ఈ పర్యటనలో మోడీతో పాటు భారత అధికారులతో సమావేశమవుతారని ఎర్నెస్ట్ వివరించారు.












Click it and Unblock the Notifications