ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి.. 14 మంది భారతీయులు గల్లంతు.. భారత ప్రభుత్వం సీరియస్
ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. MT El Gaia అనే నౌకపై జరిగిన దాడిలో 14 మంది భారతీయులు గల్లంతయ్యారు. అయితే వారిలో 13 మందిని ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగిలిన ఒక్కరు మాత్రం మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
" MT El Gaia అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రమాద సమయానికి నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. మొదట అందరూ గల్లంతు అయ్యారు. అయితే ఇప్పటివరకూ 13 మందిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన ఓ భారతీయుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే భారత దౌత్య కార్యాలయం ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఇరు దేశాలు సహాయక చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నాయని పేర్కొంది. ఇరాన్- అమెరికా యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్ తీరంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి పిలుపునిచ్చింది.
" తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని సద్దుమణిగించి దౌత్య చర్చల ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలు, సీ ఫేరర్స్, సివిలియన్స్, సివిలియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పై జరిగే దాడులు ఆమోదయోగ్యం కాదు. అలాగే ఈ ప్రాంతంలో సురక్షితంగా నౌక ప్రయాణం, వాణిజ్య నౌకల రాకపోకలు, అంతర్జాతీయ ప్రయాణ మార్గాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది..అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది.

మరోవైపు ఈ ఘటనపై ఒమన్ లోని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. " El Gaia అనే పనామా జెండా కలిగిన వాణిజ్య నౌకపై ప్రమాదం ఘటనలో 14 మంది భారతీయులు గల్లంతు కాగా ఇప్పటి వరకు 13 మందిని సురక్షితంగా వెలికి తీయడం పూర్తయింది. వారిని ఎలాంటి ఆటంకం లేకుండా ఒడ్డుకు చేర్చాము. మిగిలిన ఓ భారతీయుడు గల్లంతు కాగా అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలను ఒమన్ అధికారులు వేగవంతం చేశారు. ఒమన్ అధికారుల నిరంతర కృషికి భారత్ కృతజ్ఞతలు తెలుపుతోంది" ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇక పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే అనేక భారతీయ నౌకలు, భారత సిబ్బంది కలిగిన నౌకలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా- ఇరాన్ కు యుద్ధ భూమిగా మారింది.












Click it and Unblock the Notifications
