అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్.. దూతలే దిక్కు!
ప్రపంచ దేశాలను గడగడలాడించే పశ్చిమాసియా అగ్రరాజ్యం ఇరాన్ సర్వోన్నత నాయకుడు (సుప్రీం లీడర్) మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా, ఒక తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'సీబీఎస్ న్యూస్' (CBS News) మే 25, 2026న ఒక సంచలన కథనాన్ని వెల్లడించింది. ప్రస్తుతం బయటి ప్రపంచంతో ఆయనకు చాలా పరిమితమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని, ఈ పరిణామం ఇరాన్ అంతర్గత ప్రభుత్వ వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టిందని అమెరికా స్పష్టం చేసింది.

రహస్య దూతల నెట్‌వర్క్.. మందగించిన శాంతి చర్చలు
అమెరికా నివేదిక ప్రకారం.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని నేరుగా సంప్రదించే మార్గమేదీ లేదు. ఆయనను కేవలం నమ్మకస్థులైన రహస్య దూతల (Messengers) ద్వారా మాత్రమే సంప్రదించడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం అమెరికాలోని ట్రంప్ పరిపాలనతో ఇరాన్ అధికారులు జరుపుతున్న శాంతి చర్చలు మందగించడానికి ప్రధాన కారణం ఇదేనని తెలుస్తోంది. అమెరికా పంపే ప్రతిపాదనలు, రాయబారాలు దూతల నెట్‌వర్క్ ద్వారా చాలా ఆలస్యంగా ఖమేనీకి చేరుతున్నాయి. ఒకవేళ ఆయన నుంచి సమాధానం వచ్చినా, అప్పటికే ఆ సమాచారం పాతబడిపోతోందని, కాలయాపన ఎక్కువగా జరుగుతోందని ఇరాన్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులే వాపోతున్నారు. అసలు తమ సర్వోన్నత నాయకుడు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో ఇరాన్ టాప్ అఫీషియల్స్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం.
గూఢచర్యానికి వణుకు.. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దెబ్బ
ఇరాన్ అగ్రనాయకత్వం ఈ స్థాయిలో భయపడటానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఉమ్మడి గూఢచర్య వ్యూహాలే కారణం. గత యుద్ధ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత ఖచ్చితమైన సమాచారంతో ఇరాన్ సీనియర్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి, మెజారిటీ నాయకులను ఏరిపారేశాయి. పైగా, గతంలో జరిగిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) దాడుల్లో మొజ్తబా ఖమేనీ స్వయంగా గాయపడ్డారు.
తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి కారణమైన దాడులు.. మళ్లీ తనపై జరగకుండా ఉండేందుకు మొజ్తబా అత్యంత కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. అయితే, ఆయన పేరిట రూపొందించిన వాతావరణ ప్రకటనలు, సందేశాలను మాత్రం ఇరాన్ అధికారిక మీడియా నిరంతరం ప్రచురిస్తూ, ఆయన క్షేమంగానే ఉన్నారనే భ్రమను కల్పిస్తోంది.














Click it and Unblock the Notifications