బిగ్ రిలీఫ్: అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా-ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పైనా తీవ్రంగా ప్రభావం పడింది. దేశంలో గణనీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం మూడు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
అయితే భారత్ కు సరిహద్దు దేశం అయిన పాకిస్థాన్ లో మాత్రం పెట్రోల్ రేట్లు తగ్గాయి. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ ధరను లీటర్ కు రూ. 6 అలాగే హై స్పీడ్ డీజిల్ ధరను లీటర్ కు రూ. 6.80 రూపాయలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు తర్వాత పాకిస్థాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 403. 78 గా ఉంది. అలాగే డీజిల్ ధర రూ. 402.78 గా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం కూడా లీటర్ కు రూ. 5 తగ్గించింది అక్కడి ప్రభుత్వం.
అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది. అయితే ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు గతవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. పాకిస్థాన్ లో ప్రతివారం అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సమీక్షించే విధానం ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం అవుతోంది.

ఇక రవాణా ఖర్చులు, బేస్ ధరల సర్దుబాట్ల వల్ల దేశీయంగా ధరలను తగ్గించే అవకాశం లభించింది. అలాగే ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న రుణాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధనంపై సగటున లీటర్ కు రూ. 80 రూపాయల పెట్రోలియం లెవీ వసూలు చేయాలనే లక్ష్యాన్ని గత వారమే చేరుకుంది. దీంతో పన్నుల భారం మరింత పెంచకుండా.. అంతర్జాతీయంగా తగ్గిన ధరల ఉపశమనాన్ని నేరుగా ప్రజలకు అందించింది. అయితే ఏప్రిల్ నెలలో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 458, అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 520 కు పెరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications