"చేతులు నరుకుతాం" అన్న పాక్ మంత్రి భారత్‌కు రాక.. ఢిల్లీలో ఏం జరగబోతోంది?
షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసదిక్ మాలిక్ ఈ వారం భారత్‌కు రానున్నారు. అయితే గతంలో భారత్‌పై ఆయన చేసిన అత్యంత వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో .. "మా నీటిని ముట్టుకునే వారి చేతులు నరికేస్తాం" అంటూ ముసదిక్ మాలిక్ ఈ ఏడాది జూన్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి పర్యటన
2025 ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా.. భారత్ మరుసటి రోజే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసింది. ఆ తర్వాత మే నెలలో 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ సైనిక చర్య కూడా చేపట్టింది. ఆ పరిణామాల తర్వాత భారత్ లో అడుగుపెడుతున్న తొలి పాకిస్తాన్ నేత ముసదిక్ మాలికే కావడం గమనార్హం. అలాగే 2023లో గోవాలో జరిగిన ఎస్‌సీవో సమావేశానికి నాటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోజర్దారీ హాజరైన తర్వాత, ఓ పాకిస్తాన్ కేంద్ర మంత్రి భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.

గత జూన్‌లో ఓ సెమినార్‌లో మాట్లాడుతూ ముసదిక్ మాలిక్ భారత్‌పై రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. అంతే కాకుండా దుషాంబేలో జరిగిన జల సదస్సులోనూ జల దురాక్రమణ తగదంటూ భారత్‌ను హెచ్చరించారు. 1960 నాటి ఒప్పందాన్ని గౌరవించాలని కోరారు. అయితే తాజా ఢిల్లీ పర్యటనలో ఈ అంశాన్ని లేవనెత్తుతారా అన్న ప్రశ్నకు.. "ఇది ద్వైపాక్షిక చర్చల వేదిక కాదు" అని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం.
పురానా ఖిలా వేదికగా సదస్సు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 'ఎస్‌సీవో నాగరికతల సంభాషణ వేదిక' తొలి సదస్సుకు భారత్ ఆతిధ్యం ఇస్తోంది. నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. అక్టోబర్‌లో భారత్ ఈ సదస్సు కోసం పాకిస్తాన్ జాతీయ వారసత్వ, సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి ఆహ్వానం పంపగా.. పాకిస్తాన్ ఆయన స్థానంలో ముసదిక్ మాలిక్‌ను నామినేట్ చేసింది.
2026-27 సంవత్సరానికి ఎస్‌సీవో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాకిస్థాన్.. నాగరికతల మధ్య సంభాషణలను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ కు ఆహ్వానం పంపడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సదస్సులో చైనా, రష్యా, ఇరాన్ సహా 15 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.













Click it and Unblock the Notifications
