ట్రంప్ కు మోడీ బిగ్ షాక్- ఆ కీలక డీల్ రద్దు..! రాజ్ నాథ్ టూర్ క్యాన్సిల్..!
రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్దానికి ఆ దేశానికి సాయం చేస్తున్నారన్న కారణంతో భారత్ పై అమెరికా సుంకాల మోత మోగిస్తోంది. తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. అనంతరం మరో 25 శాతం సుంకాలు విధించి దెబ్బతీసారు. దీంతో ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో భారత్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికాకు ఇవాళ బిగ్ షాక్ ఇచ్చింది.
అమెరికా సుంకాల మోత నేపథ్యంలో ఆ దేశంతో గతంలో బోయింగ్ విమానాలు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భారత్ భారతదేశం అదనంగా ఆరు బోయింగ్ పీ-8Iలను కొనుగోలు చేసింది. దీనిని అమెరికా 2021లో 2.42 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ విమానాలను సముద్ర గస్తీ కోసం వాడుకోవాలని అప్పట్లో నిర్ణయించారు.

ఆ తర్వాత వీటి సరఫరాలో ఇబ్బందులు, ధరలు పెరగడం, ట్రంప్ సుంకాల కారణంగా ఇది కాస్తా 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు భారత్ పై ఏకంగా 50 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఈ కీలక ఒప్పందానికి భారత్ బ్రేక్ వేసేసినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపుతో ధరలు పెరగడం వల్ల బోయింగ్ విమానాల సేకరణకు సంబంధించిన విడిభాగాలు, ఇతర భాగాల రేట్లు గణనీయంగా పెరిగిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అప్పటి నుండి ఈ ఖర్చులు కొనుగోలుదారులైన భారత్ కు బదిలీ చేసినట్లు వెల్లడించాయి.

దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ బోయింగ్ విమానాల కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని పునస్సమీక్షించి, పెరుగుతున్న ఖర్చులు, అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి వంటి అంశాలను చూసుకుని తదుపరి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ ఒప్పందం లేదా దాని రద్దుపై భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో పాటు అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అలాగే క్షిపణుల కొనుగోళ్లను కూడా ఆపేశారు. వీటికి అదనంగా అమెరికా పర్యటనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications