Video: క్షణాల్లో దూసుకొచ్చిన వరద.. కొట్టుకుపోయిన గ్రామాలు!
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. టిబెట్ వైపు నుంచి ఊహించని రీతిలో విరుచుకుపడిన భయంకరమైన ఆకస్మిక వరదలు నేపాల్‌లోని పలు గ్రామాలు, వంతెనలు, ప్రాజెక్టు స్థలాలను ముంచెత్తాయి. రసువా జిల్లా పరిధిలోని భోటే కోషి నదిలో ఉదయం 9 గంటల ప్రాంతంలో జలప్రళయం ప్రారంభమై, క్షణాల వ్యవధిలో తీమురే, శ్యాప్రు బెసి ప్రాంతాలను జలమయం చేసింది. ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతికి గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ జలతాకిడికి తీమురే బజార్‌తో పాటు కస్టమ్స్ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు, వర్తక సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయి. గతేడాది వరదలకు ధ్వంసమై ఇటీవల కొత్తగా నిర్మించిన వంతెన కూడా ఈ ఉద్ధృతికి కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తీమురే ఏరియా పోలీస్ స్టేషన్, శ్యాప్రు బెసి పోలీస్ పోస్ట్‌లతో పాటు సరిహద్దు భద్రతలో ఉన్న 9 మంది సాయుధ పోలీసు సిబ్బంది కొట్టుకుపోయి గల్లంతైనట్లు సమాచారం. నదీ తీరంలోని అనేక హైడ్రో పవర్ ప్రాజెక్టులు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఆ ప్రాంతమంతా చీకట్లోనే మునిగిపోయింది.

రంగంలోకి సైన్యం.. నిమిషాల్లో ముగిసిన అత్యవసర భేటీ
పరిస్థితి అత్యంత విషమించడంతో నేపాల్ ప్రధాని బాకేంద్ర షా నేతృత్వంలో మంత్రిమండలి అత్యవసరంగా సమావేశమైంది. బాధితులను కాపాడేందుకు నేపాల్ సైన్యం, పోలీసు దళాలను తక్షణమే రంగాంలోకి దించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెండు ఆర్మీ హెలికాప్టర్లను ప్రభావిత ప్రాంతాలకు పంపారు. భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంత ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హోం మంత్రి సుదాన్ గురుంగ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
📌 Massive Flash Floods Hit Nepal
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 26, 2026
Flash floods washed away villages & damaged roads, bridges & power projects in a region bordering Tibet.
Authorities have warned of the risk of casualties. pic.twitter.com/XBwroPDDTb
వరదకు కారణమేంటి? మంచు కొండలు కరిగాయా?
ఈ ఆకస్మిక వరదకు ఖచ్చితమైన కారణం ఏంటనేది ఇంకా తేలలేదు. రసువా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదు కానప్పటికీ, సరిహద్దుల ఆవల టిబెట్ భూభాగంలో విపరీతమైన వర్షాలు పడినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. టిబెట్‌లోని అత్యంత ఎత్తైన మంచు సరస్సులు ఒక్కసారిగా బద్దలై నీరు కిందకు వచ్చిందా (GLOF) అనే కోణంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. గతేడాది కూడా భోటే కోషి నదిలో వచ్చిన ఇటువంటి వరదల వల్లే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, చైనా-నేపాల్‌ను కలిపే ప్రధాన వంతెన కూలిపోయి నెలల తరబడి రవాణా నిలిచిపోయింది.
#Rasuwa District #Nepal #flashflood
— arvind shukla (@arvindshukla25) August 26, 2026
sudden flash flood has entered Rasuwa from the Tibet side through the #BhoteKoshi River in Nepal, Horrifying visuals emerge Sudden floods hit Timure and Syabrubesi in Rasuwa district. #Scary images from affected areas pic.twitter.com/wYJCd7pkAT
బీహార్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్!
నేపాల్‌లో విరుచుకుపడిన ఈ జలప్రళయంతో పొరుగునే ఉన్న భారత రాష్ట్రం బీహార్ తీవ్ర అప్రమత్తమైంది. భోటే కోషి నది ప్రవాహం త్రిశూలి నదిలో కలిసి, అక్కడి నుంచి 'గండక్' నది రూపంలో భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. దీంతో బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, గండక్, కోషి నదీ తీర జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.














Click it and Unblock the Notifications