Canada: కెనడాలో ఉన్న భారతీయులు జాగ్రత్త.. హెచ్చరించిన కేంద్రం..
కెనడాలో విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో నివసిస్తోన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. కభారత విదేశాంగశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత హైకమిషన్
'కెనడాలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు పెరుగుతున్నాయి. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు! అయితే, విదేశాంగ శాఖతోపాటు కెనడాలోని భారత హైకమిషన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి' అని ప్రకటనలో వివరించింది.

జాగ్రత్తలు తీసుకోవాలి
'ఇప్పుడున్న పరిస్థితుల్లో కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులతో పాటు ట్రావెల్, ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియాతోపాటు టొరంటో, వాంకోవర్‌లలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాల సంబంధిత వెబ్‌సైట్‌లు లేదా మదద్(madad.gov.in) పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి' అని పేర్కొంది.
సిఖ్స్ ఫర్ జస్టిస్
ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ 'సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)' ఆధ్వర్యంలో ఖలిస్థాన్ రెఫరెండం కండక్ట చేశారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రేరేపిత దేశవ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. అయితే తాజాగా అక్కడి ఓ హిందు ఆలయంపైనా దాడి జరిగింది.












Click it and Unblock the Notifications