ఖర్కీవ్‌లో భారతీయ విద్యార్థుల ఆక్రందన.. రైలులో ఎక్కనీయని దయనీయ పరిస్థితి
ఖర్కీవ్ వీడాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన తెలిసిందే. కాలినడకనైనా ఖర్కీవ్‌ను వీడాలని స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ప్రగుణ్ అనే విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే తమను దారుణంగా కొడుతున్నారని, కేవలం ఉక్రెయిన్ ప్రజలనే రైళ్లలోకి అనుమతిస్తున్నారని వెల్లడించాడు.
ఖర్కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. తలదాచుకోవడానికి దగ్గరలో బంకర్ కూడా లేదు. అందరం బయటే ఉన్నాం. రైల్వే స్టేషన్ లో ఎదురుగా ఓ రైలు ఉంది... కానీ అందులో మేం ఎక్కడానికి వీల్లేదంటున్నారు. అదేమని అడిగితే ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా కొడుతున్నారు. గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. రైల్వే స్టేషన్ వద్ద దాదాపు 1000 మంది భారతీయులం చిక్కుకుపోయి ఉన్నాం. అసలు ఈ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవడానికే ప్రాణాలకు తెగించి వచ్చాం. సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఈ సమయంలో భారత ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే... మాకేదైనా జరిగితే మా కుటుంబాలను ఆదుకోండి" అంటూ ప్రగుణ్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చాడు.

తాము మూడు గంటలుగా ఎదురుచూస్తున్నా ఒక్క రైల్లోనూ అనుమతించలేదని మరో విద్యార్థి ఖర్కీవ్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితిని వివరించాడు. ఓ రైలు వస్తే ఎక్కామని, అయితే వెంటనే దిగిపొమ్మంటూ ఆదేశించారని వెల్లడించాడు. తమను ఎందుకు దింపేశారో అర్థంకావడంలేదని పేర్కొన్నాడు. తర్వాత వచ్చే రైల్లో అయినా తమను ఎక్కనిస్తారో లేదోనని ఆ విద్యార్థి పేర్కొన్నాడు.
హిమాంశు రాజ్ మౌర్య అనే మరో విద్యార్థి మాట్లాడుతూ, ఉక్రెయిన్ సాధారణ పౌరులు కూడా తమను రైళ్లలో ఎక్కేందుకు అనుమతించడంలేదని వెల్లడించాడు. వారి వద్ద ఉన్న తుపాకులతో భయపెడుతున్నారని వివరించాడు. తమ బృందంలో విద్యార్థినులు కూడా ఉన్నారని, అమ్మాయిలు అని కూడా చూడకుండా వారిపైనా చేయి చేసుకుంటున్నారని తెలిపాడు.












Click it and Unblock the Notifications