అంతర్జాతీయ కోర్టుకు అనూహ్య షాక్..! ట్రంప్ కీలక అడుగులు..!
హేగ్ లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)కి భారీ షాక్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్దమవుతున్నారు. జాతిహత్య, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, యుద్ధ నేరాలు, ఆక్రమణ నేరాలు వంటి అత్యంత తీవ్ర అంతర్జాతీయ నేరాలకు బాధ్యులైన వ్యక్తులను విచారించే అధికారం కలిగిన ఈ కోర్టును ఆంక్షలతో దెబ్బతీసేందుకు, ఇంకా చెప్పాలంటే రద్దు చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
రాబోయే ఆరు నుంచి ఏడు నెలల్లో అంతర్జాతీయ నేర న్యాయస్థానంపై భారీ ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సర్కార్ రంగం సిద్దం చేస్తున్నట్లు అమెరికాకు చెందిన 'ది జర్నల్' తెలిపింది. ఆరు నుండి ఏడు నెలల గడువు కాలం తర్వాత ఐసీసీతో జరిపే చాలా వరకు లావాదేవీలను ఈ ఆంక్షలు నిషేధిస్తాయి. అంటే ఇకపై దేశాలు, దేశాధినేతలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించినా
ఫలితం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారాలకు కత్తెర వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆప్ఘనిస్తాన్ లో అమెరికా బలగాలపై యుద్ద నేరాల అభియోగాలు మోపడం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును యుద్ద నేరస్తుడిగా నిర్ధారిస్తూ సమన్లు జారీ చేయడం వంటి చర్యలపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ప్రభుత్వం ఈ మేరకు అంతర్జాతీయ కోర్టును దెబ్బతీసేందుకు సిద్దమవుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును గుర్తించే దేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా వాటిని దూరం చేయడం, ఐసీసీని ఒంటరిని చేయడం ట్రంప్ సర్కార్ ప్లాన్స్ లో భాగంగా ఉన్నాయి. అలాగే ఐసీసీ న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్ల సంఖ్యపై ఆంక్షలు విధించడం ద్వారా అక్కడ జరిగే విచారణలను బలహీనం చేయడం కూడా ఉంది. ఈ మేరకు ఈ వారం జరిగే ఐరాస సాధారణ మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ కోర్టుకు యూఎస్ లో కంపెనీలు, వ్యక్తులు నిధులు ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోతుంది.














Click it and Unblock the Notifications
