పాకిస్తాన్ కు ట్రంప్ సిసలైన సవాల్ ..! ఇది కదా అసలు ట్విస్ట్..!
ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ప్రారంభించిన యుద్దం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరువైపులా కాల్పులు ఆగిపోయినా పశ్చిమాసియాలో మాత్రం అంతకు మించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్ విషయంలో ఉప్పూనిప్పులా వ్యవహరిస్తున్న అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎలాగైనా వీరిని ఒప్పించి ఇజ్రాయెల్ కు గుర్తింపు సాధించిపెట్టాలనే ట్రంప్ ఆలోచన ఇప్పుడు పాకిస్తాన్ వంటి (Pakistan) దేశాలకు ఇబ్బందికరంగా మారింది.
ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత అబ్రహాం ఒప్పందాల్లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్‌ను, పలు ముస్లిం దేశాలను కోరార. ఇది పాకిస్తాన్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పెనుసవాల్ గా మారింది. దీంతో పెరుగుతున్న అమెరికా ఒత్తిడి, పాలస్తీనాపై పాకిస్తాన్ తీవ్ర సున్నితమైన ప్రజా వైఖరి మధ్య ఆయన ఇరకాటంలో పడ్డారు. ట్రంప్ తాజాగా పాకిస్తాన్, పలు అరబ్ దేశాలతో నిర్వహించిన ఉన్నత స్థాయి కాల్ తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. ఆక్సియోస్ నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని ముస్లిం దేశాలు అబ్రహాం ఒప్పందాల్లో చేరాలని ట్రంప్ గట్టిగా కోరారు. అంటే, ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించమని సూచించారు.

ఆ కాల్‌లో ట్రంప్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించగానే పూర్తి నిశ్శబ్దం అలుముకుందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ చివరకు చమత్కరించి, పాకిస్తాన్‌తో సహా పాల్గొన్న వారందరూ ఇంకా అక్కడే ఉన్నారా అని అడిగారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్న పాకిస్తాన్, ట్రంప్ నుండి ఇలాంటి డిమాండ్‌ను ఆశించలేదు. అంతకంటే ముఖ్యంగా, ఈ ప్రతిపాదన పాకిస్తాన్‌ను తీవ్రమైన సంక్లిష్టతలో పడేయడం ఖాయం. పాలస్తీనా అంశం పాకిస్తాన్ ప్రజలకు ఎల్లప్పుడూ భావోద్వేగపూరిత విషయంగా ఉంది. పాలస్తీనాపై స్పష్టత లేకుండా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించడం పేలుడుకు సిద్ధంగా ఉన్న మందుగుండు పెట్టె లాంటిది. సైనిక వ్యవస్థతో పాటు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడం రాజకీయంగా విధ్వంసానికి దారితీస్తుందని తెలుసు.

వాస్తవానికి 2020లో ట్రంప్ మొదటి పదవీకాలంలో అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఆ సమయంలో వైట్‌హౌస్ బాల్కనీలో ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులు ఉన్నారు. ఈ ఒప్పందాలను ఆవిష్కరిస్తూ, వారు దీనిని కొత్త మధ్యప్రాచ్య ఆరంభంగా అభివర్ణించారు.అయితే అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఒప్పందాలలో చేరడానికి నిరాకరించారు. పాకిస్తాన్ ఎప్పటినుంచో ద్వి-రాజ్య పరిష్కారానికి మద్దతు ఇస్తోందని, దీనికి విరుద్ధంగా వెళ్లడం సరైంది కాదని ఆయన వాదించారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు జరిగిన 2 నెలల తర్వాత, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి తన ప్రభుత్వంపై అమెరికా, ఇతర దేశాల నుంచి పదేపదే ఒత్తిడి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. మతతత్వ, మౌలికవాద వర్గాల భారీ నిరసనలకు దారితీస్తుందని తెలిసి, యూదులతో ఎలాంటి ఒప్పందం చేసుకోబోనని ఆయన పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications