హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ కు బిగ్ షాక్
హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. యూఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా పన్నులు లేదా ఆదాయాన్ని పెంచే చర్యలను నేరుగా చేపట్టే అధికారం అధ్యక్షుడికి లేదని పిటిషనర్లు వాదించారు. తాజాగా పెంచిన వీసా ఫీజు.. దీని పరిధిలోకే వస్తుందని తేల్చి చెప్పారు. ఫీజును పెంచడానికి ముందు ట్రంప్.. రెగ్యులేటరీ చట్టాలు, అందులో ఉన్న ప్రక్రియను పాటించ లేదని లో విఫలమైందని వారు పేర్కొన్నారు.
ఈ పిటీషన్ ను కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి వాదోపవాదాలను ఆలకించనుంది. హెచ్ 1బీ విసా పెంపుపై ఓ పిటీషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. దీంతో దీనిపై న్యాయస్థానం నుంచి ఎటువంటి ఆదేశాలు, తీర్పు వెలువడుతుందనేది చర్చనీయాంశమౌతోంది. దీనికి మద్దతుగా మరిన్ని సప్లిమెంటరీ పిటీషన్లు దాఖలు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

హెచ్ 1బీ విసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ కిందటి నెలలో డొనాల్డ్ ట్రంప్.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి.
పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు, ఇతర సంఘాలు.. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమైనదని పేర్కొన్నాయి. దీన్ని నిరంకుశ చర్యగా అభివర్ణించాయి. లక్ష డాలర్ల ఫీజు పెంపు వల్ల ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలు, పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థలు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఆయా సంస్థలన్నీ కూడా నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయని, విసా ఫీజు పెంపు వల్ల వాళ్లందరూ అమెరికాకు రావడం తగ్గుతుందని, ఫలితంగా కార్యకలాపాలు స్తంభించిపోతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ పిటీషన్ ను కాలిఫోర్నియా కోర్టు విచారణకు స్వీకరించింది. వాదోపవాదాలను ఆలకించనుంది.
ఈ ఫీజు కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతోంది వైట్ హౌస్. ఇప్పటికే జారీ అయిన H-1B వీసా హోల్డర్లకు వర్తించదనీ స్పష్టం చేస్తోంది. ఇది వార్షిక ఫీజు కాదని, వన్-టైమ్ ఫీగా వివరణ ఇచ్చింది. కొత్త వీసాలకు మాత్రమే ఈ ఫీజు చెల్లుబాటు అవుతుందని, రెన్యూవల్స్ లేదా ప్రస్తుత వీసా హోల్డర్లపై ఎటువంటి భారం పడబోదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరొలినా లీవిట్ పేర్కొన్నారు. దేశం వెలుపల ఉన్న వీసా హోల్డర్లకు కూడా వర్తించబోదని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications