మరో భారతీయుడి ఘనత: ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్, ఇతను ఎవరంటే?
వాషింగ్టన్: మరో భారతీయుడు దిగ్గజ సంస్థకు అధిపతి కాబోతున్నారు. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలకు అధినేతలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.

జాక్ డోర్సే స్థానంలో పరాగ్ అగర్వాల్
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది గంటల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాగ్ అగర్వాల్ ఆయన స్థానంలో కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం.

బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేసిన పరాగ్
ఇక పరాగ్ అగర్వాల్ గురించిన వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో 2011లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ సంస్థల్లోనూ పరాగ్ కీలక బాధ్యతలు
పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో రీసెర్చ్ చేశారు పరాగ్ అగర్వాల్. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు పరాగ్. ఆ తర్వాత 2018లో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పదోన్నతి పొందారు. గత పదేళ్లుగా ట్విట్టర్ లోనే పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్.. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కంజ్యూమర్, రెవెన్యూ, సైన్స్ టీంల బాధ్యతలు నిర్తర్తిస్తున్నారు.
Recommended Video

జాక్ సహా టీం సభ్యులకు ధన్యవాదాలంటూ పరాగ్ అగర్వాల్ ఆనందం
తాజాగా, ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఇందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. 'జాక్‌కి, మా బృందం మొత్తానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. భవిష్యత్తు కోసం చాలా ఉత్సాహం ఉంది. నేను కంపెనీకి పంపిన నోట్ ఇదిగో. మీ విశ్వాసం, మద్దతు కోసం అందరికీ ధన్యవాదాలు' అని పరాగ్ అగర్వాల్ తెలిపారు. కాగా, జాక్ సీఈవోగా ట్విట్టర్ అభివృద్ధికి చాలా కృషి చేశారు. మంగళవారం కంపెనీ వాటా 9 శాతం పెరిగింది. అయితే జాక్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నారనే సమాచారంతో కంపెనీ షేర్లు 3 శాతం పడిపోయాయి.












Click it and Unblock the Notifications