Israel Palestine War : గాజా అష్టదిగ్బంధంపై ఐరాస సీరియస్-ఇజ్రాయెల్ చర్యలపై..
ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ ఏకకాలంలో భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో మెరుపుదాడులు చేస్తూ విరుచుకుపడి మూడు రోజులు కావస్తోంది. తొలిరోజే హమాస్ దాడుల్ని తిప్పికొట్టడం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అనంతరం తమ ప్రతిదాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పుడు పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సహకారంతో హమాస్ దాడులకు కేంద్రంగా మారిన గాజా ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది.
గాజాకు తాగునీరు, విద్యుత్ సహా నిత్యావసరాలు కూడా అందకుండా ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇలా గాజాను దిగ్బంధించడంపై ఐరాస కూడా ఇవాళ స్పందించింది. గాజాను పూర్తిగా దిగ్బంధించడాన్ని ఖండిస్తున్నట్లు ఐరాస ఇవాళ ప్రకటించింది. అక్కడ నివసిస్తున్న సాధారణ పౌరులకు దీని వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా పోరు ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 2 లక్షల మంది లేదా జనాభాలో దాదాపు పదో వంతు మంది గాజాలో తమ ఇళ్లను విడిచిపెట్టారని ఐరాస తెలిపింది. గాజా దిగ్బంధనం కారణంగా అక్కడి ప్రజలకు నీరు, విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం హెచ్చరించింది. గాజా స్ట్రిప్ వ్యాప్తంగా జన సంఖ్య నాటకీయంగా పెరుగుతోందని ఐరాస తెలిపింది. శనివారం నుండి అక్కడ జనాభా 187,500 మందికి పైగా చేరుకున్నట్లు వెల్లడించింది.
గాజాలో ప్రస్తుతం చాలా మంది పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారని ఐరాస తెలిపింది. ఇజ్రాయెల్-పాలస్తీనా పోరు ముదిరితే ఇక్కడ తలదాచుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. వారాంతం నుండి గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య సదుపాయాలపై 13 దాడులు జరిగినట్లు తెలిపారు. అక్కడ నిల్వ చేసిన ఐరాస వైద్య సామాగ్రి ఇప్పటికే వాడుతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications