పుతిన్ - లావ్రోవ్ ఆస్తుల స్తంభన : అమెరికా - ఈయూ అంగీకారం : రష్యా సస్పెండ్..!!
ఉక్రెయిన్ పైన రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు దాడుల తీవ్రత కొనసాగింది. చర్చల ప్రస్తావన వచ్చినా...రెండు దేశాల నుంచి అడుగులు ముందుకు పడటం లేదు. చర్చలకు రావాలంటే ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వీడాలని రష్యా షరతు విధించింది. ఇదే సమయంలో 18 ఏళ్లు దాటిని వారికి ఉక్రెయిన్ ఆయుధాలు అందిస్తోంది. ఇప్పటికే అమెరికాతో సహా యూకే సైతం రష్యా పైన పలు ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా యూకే విమానాల పైన రష్యా ఆంక్షలు ప్రకటించింది. ఇదే సమయంలో.. అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రష్యాపై కఠిన ఆర్దిక ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అంగీకారం తెలిపింది. అమెరికాలో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది. వీరిద్దరి ఆస్తుల స్తంభనకు ఈయూ కూడా ఆమోదించింది. యూరప్ దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేస్తూ నిర్ణయం వెల్లడించింది. యూరోప్‌లోని మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరోపా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఐరోపా కౌన్సిల్ లో ఉన్న 47 దేశాలు రష్యా తీరును తప్పు బడుతున్నాయి.

రష్యాను ఉక్కిరి బిక్కరి చేసేలా
రష్యా తీరును తప్పు బడుతూ జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. రష్యాపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నియంత్రిస్తున్నాయి. జపాన్ మరో ముందుడగు వేసింది. రష్యాకు సంబంధించిన వారి వీసాల మంజూరు నిలిపివేసింది.

జపాన్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని కఠిన ఆంక్షలను ప్రకటించింది. సైనిక బలగంతో ఏ దేశ సరిహద్దులను మార్చాలని ప్రయత్నాలు చేసినా.. తాము సహించమని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా హెచ్చరించారు. రష్యా తీసుకుంటున్న నిర్ణయాలు..చర్యలు యూరప్ తో పాటుగా ఆసియా పైన ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఆంక్షల పైన రష్యా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. బ్రిటన్ విమానాల పైన మాత్రం ఆంక్షలు విధిస్తూ..కౌంటర్ గా నిర్ణయం తీసుకుంది. ఇక, సైన్యానికి తాజాగా పుతిన్ మరిన్ని ఆదేశాలు ఇచ్చారని..పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పినట్లుగా వస్తున్న వార్తలతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications