సూట్లు: జాన్సన్ నుంచి ఒబామా వరకూ అతడే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులకు టైలర్‌గా పనిచేసిన ఫ్రెంచ్ వ్యక్తి జార్జెస్ డీ ప్యారీ ఆదివారం మరణించారు. మరణించే నాటికి ఆయన వయసు 81. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ జాన్సన్‌తోపాటు రొనాల్డ్ రీగన్, జిమీ కార్టర్ హెచ్‌డబ్లూ బుష్, జార్జ్ డబ్లూ బుష్, బిల్ క్లింటన్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు సూట్లు కుట్టారు.
సాధారణ జీవితం గడుపుతున్న ఆయన రెండు నెలల క్రితం వరకూ విధుల్లో ఉన్నారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ రావడంతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1963లో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన తర్వాత లిండన్ జాన్సన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత జార్జెస్ విధుల్లో చేరారు.
ఫ్రాన్స్‌లో టైలరింగ్ వృత్తిని నేర్చుకున్న పారీ తన 27వ ఏట దాదాపు రెండున్నర లక్షల రూపాయల సొమ్ముతో అమెరికాకు వచ్చారు. ఓ అమెరికా అమ్మాయితో పరిచయమైంది. ఆమెతో కలసి కొంతకాలం కాపురం చేశారు. పారీ వద్ద ఉన్న సొమ్మును తన గర్ల్ ఫ్రెండ్ ఆమె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుంది.

అనంతరం ఆయన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో రోడ్డున పడ్డ పారీ వైట్‌హౌస్ పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్ కెనడియన్ టైలర్ వద్ద పనిలో చేరారు. ఆ తర్వాత కొంత కాలానికి తన యజమాని చనిపోవడంతో తానే షాపుకి యజమాని అయ్యారు.
ఒక రోజు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడైన లిండన్ జాన్సన్ ఆయన దుకాణానికి వచ్చి సూటు కుట్టించుకున్నారు.
ఆ సూట్ జాన్సన్‌కు ఎంతగానో నచ్చడంతో టైలర్ పారీని వైట్ హౌస్‌కు పిలిపించి తన భార్య, పిల్లలకు పరిచయం చేశారు. అప్పటి నుంచి పారీ అమెరికా దేశాధ్యక్షులకు టైలర్ అయ్యారు. కొలతలు తీసుకుంటున్నప్పుడు ఏ అధ్యక్షుడు ఎలా ఉంటారన్న విషయమై జార్జెస్ పలు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
రోనాల్డ్ రీగన్, జెల్లీ బీన్స్ తింటూ తినమని తనకూ ఇచ్చేవారని, కొంతమంది అధ్యక్షులు సీరియస్‌గా ఉండేవారని, మరికొంత మంది మౌనంగా ఉండేవారని ఆ ఇంటర్వ్యూలలో ఆయన తెలిపారు. జార్జెస్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications