ట్రంప్-పుతిన్ చర్చలు ఫెయిలైతే భారత్ కు చుక్కలే..! అమెరికా హెచ్చరిక..!
అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ పుతిన్ మధ్య రేపు అలస్కాలో కీలక చర్చలు జరగబోతున్నాయి. ఉక్రెయిన్ లో రష్యా యుద్దం ఆపడమే లక్ష్యంగా ట్రంప్ ఈ చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చర్చల ఫలితం ప్రపంచదేశాలపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా భారత్ కూ ఈ చర్చలు సంకటంగా మారాయి. ఇప్పటికే చమురు కొంటూ రష్యాకు సాయం చేస్తున్న భారత్ పై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ ఇప్పుడు పుతిన్ తో చర్చలు విఫలమైతే మరింత రెచ్చిపోయే ప్రమాదం పొంచి ఉంది.
రేపు అలస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైతే మాత్రం భారత్ పై మరింత సుంకాల మోత మోగించడం ఖాయమని అమెరికా ప్రభుత్వ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ట్రంప్ చెప్పినట్లు వినమని భారత్ ఒత్తిడి చేయాలనేది ఈ హెచ్చరికల సారాంశం అన్నమాట. అమెరికా ఆర్దికమంత్రి స్కాట్ బెస్సెంట్ బ్లూమ్ బర్గ్ టీవీతో మాట్లాడుతూ ట్రంప్-పుతిన్ చర్చల ఫలితాన్ని బట్టి భారత్ పై సుంకాల పెంపు ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పేశారు.

రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతీయులపై తాము ద్వితీయ సుంకాలను విధించామని, అయితే రేపు ట్రంప్-పుతన్ భేటీ సజావుగా జరగకపోతే మాత్రం ఆంక్షలు లేదా ద్వితీయ సుంకాలు పెరగవచ్చని బెసెంట్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి భారత్ సాయం చేస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ తాజాగా భారత్ పై గతంలో విధించిన 25 శాతం సుంకాలకు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించారు.
ఇప్పుడు ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైతే దాన్ని మరో 25 శాతం పెంచుతారా లేక ఏకంగా 100 శాతానికి తీసుకెళ్లిపోతారా తెలియని పరిస్ధితి నెలకొంది. అలాగే ఆంక్షల కొరడా కూడా ఝళిపించే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే అమెరికాకు భారతీయ ఎగుమతులు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా విధించిన సుంకాల్ని అసమంజసం, అహేతుకం అంటూ విమర్శలు గుప్పిస్తున్న భారత్.. తాము జాతి ప్రయోజనాల కోసమే రష్యా చమురు కొనాల్సి వస్తోందని చెప్పుకొస్తోంది.

మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చల్లో భారత్ అవిధేత చూపిస్తోందంటూ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఈ నెలలో అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రష్యాతో చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోవడంతో ట్రంప్ ఈ చర్చలు ఆపేశారు. అయితే భారతీయ ఉత్పత్తులపై 50 శాతం సుంకం అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 25న అమెరికా ప్రతినిధులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నందున వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications