వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ కప్ ఫైనల్: ఇక ఫుట్‌బాల్‌ రారాజు మెస్సీయేనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మెస్సీ

లియోనెల్ మెస్సీ.. ఈ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోతోంది.

ఆదివారం రాత్రి దోహాలోని లూసెయిల్ స్టేడియంలో లైట్లన్నీ అతడి వైపే తిరిగాయి. ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన వరల్డ్ కప్ మెస్సీ చేతికందింది.

35 ఏళ్ల అర్జెటీనా మాస్ట్రో 'బిష్ట్' అని పిలిచే సంప్రదాయ అరబ్ వస్త్రాన్ని ధరించి వరల్డ్ కప్ అందుకునేందుకు సిద్ధంగా నిల్చున్నాడు. రెండు చేతులూ రుద్దుకున్నాడు. ఉద్వేగం అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది.

జయజయధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. టపాసులు పేలాయి. లైట్లన్నీ మెస్సీ వైపు తిరిగాయి. మెస్సీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆకాశానికెత్తి పట్టుకున్నాడు.

మెస్సీ తన కలను సాకారం చేసుకున్నాడు. తన అపూర్వమైన ఫుట్‌బాల్ కెరీర్‌లో మిగిలిన ఆ ఒక్క వెలితి తీరిపోయింది.

నిన్న జరిగిన ఫైనల్స్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యద్భుతమైన మ్యాచ్ అని చెబుతున్నారు.

నిన్నటి మ్యాచ్‌లో ఎన్నో భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఆటగాళ్ల గుండె వేగం పెరిగింది. కాసేపు ఉత్సాహం, కాసేపు టెన్షన్. చివరికి, అర్జెంటీనా కొత్త విజేతగా అవతరించింది.

లియోనెల్ మెస్సీ ఇక వరల్డ్ కప్‌ను తన విజయాల జాబితాకు కలుపుకోవచ్చు.

ఏడు బాలన్స్ డి'ఓర్, నాలుగు ఛాంపియన్స్ లీగ్‌లు, ఒక కోపా అమెరికా, బార్సిలోనాతో 10 లా లిగా టైటిల్స్, ప్యారిస్ సెయింట్-జర్మైన్‌తో ఫ్రాన్స్‌లో ఒక లీగ్ 1 కిరీటం, 2022 వరల్డ్ కప్.. ఇవీ మెస్సీ అందుకున్న శిఖరాలు.

గతంలో ఎన్ని విజయాలు అందుకున్నా వరల్డ్ కప్ చేసే మ్యాజిక్ వేరు. మెస్సీ అభిమానులు ఇప్పుడు దీన్ని ముందు పెట్టుకుని, ఫుట్‌బాల్ ప్రపంచానికి అతడే రారాజు అని కాలర్లు ఎగరేస్తారు.

15 అంగుళాల పొడవైన, అసలుసిసలైన ఈ బంగారపు ట్రోఫీ మెస్సీని ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగడిగా నిలబెడుతుంది. ప్రత్యర్థుల వాదను వీగిపోయేలా చేస్తుంది.

తరతరాల వరకు మెస్సీని ఇతర ఆటగాళ్లను పోలుస్తూ ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటారు.

'పీలే’ని ఫుట్‌బాల్ దేవుడిగా కొలుస్తారు అభిమానులు.

ఆదివారం లుసెయిల్ స్టేడియంలో ఎగిరిన అర్జెంటీనా బ్యానర్లు చూస్తే మెస్సీకి కూడా ఆ స్థానం వచ్చిందన్నది ఎవరూ కాదనలేని నిజం.

అర్జెంటీనా లెజెండ్ ప్లేయర్ డీగో మారడోనాతో మెస్సీని పోలుస్తుంటారు.

కాకతాళీయంగా, ఇద్దరూ మైదానంలో 10 నంబర్ టీ షర్ట్ వేసుకున్నవాళ్లే.

36 ఏళ్ల క్రితం మెక్సికోలో వరల్డ్ కప్ ఎత్తి పట్టుకున్నాడు మారడోనా.

మెస్సీ ఆ స్థాయికి చేరుకోలేదని ఇన్నాళ్లు పెదవి విరిచేవారు. ఇక ఇప్పుడు ఆ అవకాశం లేదు.

అద్భుతమైన ఫుట్‌బాల్ ఆటగాళ్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మెస్సీ పేరు వినిపించకుండా ఉండదు.

ఇప్పుడు వరల్డ్ కప్ కిరీటం కూడా దక్కడంతో అతడి బలం మరింత పెరిగింది.

ఈ కథను ఎక్కడ మొదలుపెట్టాలి? ఫుట్‌బాల్ ఆటలో అత్యున్నత శిఖరాన్ని అందుకోవడానికి మెస్సీ తన ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించాడు? అర్జెంటీనాను విజయపథం వైపు నడిపించిన సంఘటనలు ఏవి?

మెస్సీ, ఎంబాపె

ఇది అపూర్వమైన విజయం

మెస్సీకి ఇది అలవోకగా వచ్చిన విజయం కాదు. 2006 నుంచి అందని ద్రాక్షలా ఊరిస్తోంది వరల్డ్ కప్. 2014లో రియోస్ మారకానాలో జర్మనీ చేతిలో ఫైనల్స్ ఓడిపోయిన నొప్పి మెస్సీకి తెలుసు. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఆశనిరాశలు, ఎంతో శ్రమ, ఎంతో వేదన, ఏళ్ల తరబడి నిరీక్షణ తరువాత చేతికి అందిన ఫలం ఇది. అందుకే ఈ విజయం మరింత మధురం.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే, అత్యంత ప్రతిభావంతుడైన ఫ్రాన్స్ ఆటగాడు 23 ఏళ్ల కైలియన్ ఎంబాపె మైదానంలో ఉండగా ఇదంతా జరిగింది. ఎంబాపే ఇప్పటికే మెస్సీ లాంటి అగ్రగణ్యుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకవేళ ఎవరైనా కాదన్నా, రాబోయే కొన్నేళ్లల్లో ఆ స్థానానికి కచ్చితంగా చేరుకుంటాడు.

నిన్నటి మ్యాచ్‌లో ఫ్రాన్స్ మొదటి నుంచీ మెస్సీ కోసం రెడ్ కార్పెట్ పరిచినట్టే కనిపించించి. గట్టిగా 80 నిమిషాలు కూడా వాళ్లని బెదిరించలేకపోయారు.

ఫైనల్స్‌లో పెనాల్టీ రౌండ్‌లో అర్జెంటీనాకు తొలి గోల్ సాధించాడు మెస్సీ. దాంతో, ప్రపంచ కప్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే టోర్నమెంట్‌లో గ్రూప్ దశలో, రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లో తొలి గోల్ కొట్టిన ఆటగాడిగా చరిత్రపుటల్లోకి ఎక్కాడు.

ఫైనల్స్‌లో మెస్సీ తరువాత ఏంజెల్ డి మారియా సెకండ్ గోల్ కొట్టాడు. మ్యాచ్ 2-0కు చేరుకుంది. అర్జెంటీనా అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు.

కానీ, అవతలి జట్టులో పులి లాంటి ఎంబాపే విరుచుకుపడ్డాడు. హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. మ్యాచ్ 3-3కు చేరుకుంది. మళ్లీ టెన్షన్.

చివరి 10 నిమిషాలలో ఎంబాపె గోల్ కొడుతుంటే, మెస్సీ ఒక నవ్వు నవ్వాడు. నమ్మశక్యం కాని విషయాన్ని చూసినప్పుడు వచ్చే నవ్వు అది. "మళ్లీ అదే జరగబోతోందా" అన్న ఆశ్చర్యం, విచారం.

మ్యాచ్‌లో 64 నిమిషాలు ముగిశాక అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల ఏంజెల్ డీ మరియాను వెనక్కు పంపి, అతని స్థానంలో మార్కోస్ అకూనాను రంగంలోకి దింపాడు.

ఇంతలో ఎంబాపే గోల్స్ చేసి స్కోరును సమం చేశాడు. మ్యాచ్ 80వ నిమిషంలో పెనాల్టీని గోల్ స్కోర్ చేసిన ఎంబాపె, ఆ తరువాత రెండు నిమిషాల్లోనే మరో గోల్ చేశాడు.

లూసెయిల్ మైదానంలో పూనకాలు వచ్చేశాయి. మ్యాచ్ ఎటు తేలుతుందో తెలియని పరిస్థితి. ప్రేక్షకుల్లో టెన్షన్. కొంతమంది ఆట చూడకుండా బుర్ర తిప్పేసుకున్నారు.

ఆ తరువాత 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ ఆట కొనసాగింది. 108వ నిమిషంలో మెస్సీ మరో గోల్ చేశాడు. 118వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఎంబాపె గోల్ కొట్టాడు. మళ్లీ స్కోర్లు సమం అయింది.

ఇక పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. రెండు జట్ల పైనా భయంకరమైన ఒత్తిడి. 4-2 స్కోరుతో అర్జెంటీనా విజయపథంలోకి దూసుకెళ్లింది.

మ్యాచ్ ముగించడానికి పెనాల్టి షూటౌట్ బాధాకరమైన మార్గం. ఈ వరల్డ్ కప్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దీని గురించి కూడా జనం మాట్లాడుకుంటారు.

మెస్సీ

మెస్సీ రికార్డుల ప్రభంజనం

అర్జెంటీనా జట్టును ట్రోఫీకి దగ్గర చేసిన చివరి గోల్ గోన్జాలో మోంటియెల్ చేశాక, మెస్సీ ఆనందభాష్పాలతో మోకళ్లపై కూలబడ్డాడు. చేతులు పైకెత్తాడు. సహచరులంతా పరిగెత్తుకుంటూ వచ్చి మెస్సీని చుట్టుముట్టారు. విజయోత్సవాలు మొదలయ్యాయి.

విజేతలకు ట్రోఫీ అందించడానికి సన్నాహాలు చేస్తుండగా, మెస్సీ మైక్రోఫోన్ తీసుకుని అర్జెంటీనా అభిమానులతో మాట్లాడాడు.

ఈ వరల్డ్ కప్‌లో మెస్సీ సాధించిన రికార్డులకు కొరతలేదు.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా మెస్సీ గోల్డెన్ బాల్ అందుకున్నాడు. 1982లో గోల్డెన్ బాల్ పురస్కారం ఇవ్వడం ప్రారంభించిన దగ్గర నుంచి దాన్ని రెండవసారి అందుకున్న తొలి ఆటగాడు మెస్సీ. 2014లో తొలిసారి, 2022లో మలిసారి గోల్డెన్ బాల్ అందుకున్నాడు.

మెస్సీ ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంటుల్లో అర్జెంటీనా తరపున మొత్తం 21 గోల్స్ చేశాడు. ఒక జట్టు తరుపున ఒక ఆటగాడు కొట్టిన అత్యధికం ఇదే.

మొత్తం కెరీర్‌లో 793 గోల్స్ చేసాడు. ఈ టోర్నమెంట్‌లో ప్రతి దశలో తొలి గోల్ కొట్టిన ఆటగాడు.

ఇవన్నీ కాదు, మెస్సీ ప్రపంచ కప్ విజేత.. ఇదే అంతిమంగా కౌంట్ అయ్యేది.

1986 తరువాత మళ్లీ అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచ విజేతగా అవతరించింది.

అర్జెంటీనా అభిమానులు తమ దేశం స్వరపరచిన వరల్ఢ్ కప్ పాట పాడారు. మెస్సీకి నీరాజనాలు పలికారు.

వరల్డ్ కప్ ప్రారంభంలో అర్జెంటీనా సౌదీ ఆరేబియాలో చేతిలో ఓడిపోయింది. కానీ, మెక్సికోపై మెస్సీ చేసిన గోల్‌తో వాళ్ల విజయయాత్ర ప్రారంభమైంది.

అన్‌స్టాపబుల్ మెస్సీ లూసెయిల్ స్టేడియంలో ట్రోఫీ అందుకుని ఘనంగా వరల్డ్ కప్ ముగించాడు.

16 ఏళ్ల తన లక్ష్యం నెరవేరింది. జర్మనీలో సెర్బియా, మోంటెనెగ్రోపై 6-0 విజయం సాధించిన అర్జెంటీనా జట్టులోకి స్కోరింగ్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చినప్పటి నుంచి కన్న కల ఇది.

ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌తో మ్యాచ్ థ్రిల్లర్‌లా సాగింది. ఎన్నో మలుపులు, ఎంతో టెన్షన్. చిరకాలం గుర్తుంచుకోదగ్గ అద్భుతమైన మ్యాచ్‌లో మెస్సీ శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

English summary
World Cup Final: Is Messi the King of Football?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X