భగ్గుమన్న మధ్య-తూర్పు ఆసియా: అరబ్ ఎమిరేట్స్‌పై యెమెన్ బాంబు దాడి
అబుధాబి: మధ్య-తూర్పు ఆసియా దేశాల్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మద్దతు ఇస్తోన్నట్లుగా అనుమానిస్తోన్న హౌతీ ఉద్యమకారులు ఎమిరేట్స్‌పై బాంబు దాడికి పాల్పడ్డారు. డ్రోన్లతో వరుసగా బాంబులను విసిరారు. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అబుధాబి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడింది హౌతీ ఉద్యమకారులేనంటూ నిర్ధారించారు.
ముసప్ఫా పారిశ్రామిక ప్రాంతంలో గల అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అల్ బతీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండు బాంబుదాడులు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని మూడు ఆయిల్ ట్యాంకర్లు ఈ దాడిలో ధ్వంసమైనట్లు చెప్పారు. డ్రోన్లతో బాంబు దాడులను చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

అబుధాబి పోలీసులు ఈ ప్రకటనను విడుదల చేసిన కొద్దిసేపటికే యెమెన్ హౌతీ ఉద్యమకారులు స్పందించారు. ఈ దాడికి తామే కారణమని వెల్లడించారు. అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఇస్తోన్న ఉమ్మడి సైనిక బలగాలు ఇటీవలే యుమెన్‌లోని షాబ్వా, మరీబ్ రీజియన్లపై వైమానిక దాడులు చేశాయి. ఈ రెండు రీజియన్లపైనా హౌతీ ఉద్యమకారులకు గట్టి పట్టు ఉంది. వారి ప్రాబల్యం ఎక్కువ. దీనికి ప్రతీకారంగా వారు అబుధాబిపై డ్రోన్లతో దాడికి దిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Three fuel tanks explode near oil company's depots in Abu Dhabi; Houthis claim responsibility
— ANI Digital (@ani_digital) January 17, 2022
Read @ANI Story | https://t.co/xr2m3RzDLz pic.twitter.com/uxVwrqJHMv
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి విభేదాలు సుదీర్ఘకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్నాయి. ఇరాన్ అండగా ఉంటూ వస్తోన్న హౌతీ ఉద్యమకారులను అణచివేయాలనే లక్ష్యంతో అరబ్ ఎమిరేట్స్ పని చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని యెమెన్, ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నాయి. అందుకే తరచూ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో బాంబుదాడులకు పాల్పడుతూ కంటి మీద కునుకు లేకుండ చేస్తోన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో యెమెన్ సైన్యాన్ని అరబ్ ఎమిరేట్స్ చావుదెబ్బ కొట్టిన తరువాత- ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయని అంటున్నారు.