చిచ్చుపెట్టిన కేదార్ జాదవ్: ధోనీపై విమర్శల జడివాన: అతనిలో ఆ స్పార్క్ ఉందా?: మాజీ కేప్టెన్
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఏ మాత్రం ఫామ్‌లో లేని రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓడిపోవడం.. విమర్శలకు తావిచ్చింది. ఈ ఓటమి అనంతరం క్రికెట్ క్రిటిక్స్, టీమిండియా మాజీ క్రికెటర్లు, సీనియర్ల చూపుడువేలు.. టీమ్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వైపే లేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ధోనీ బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ సీజన్‌లో అతి తక్కువ స్కోరుతో..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది ఏడో పరాజయం. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో మూడింట మాత్రమే నెగ్గింది ధోనీ సేన. రాజస్థాన్ రాయల్స్‌పై ఏ మాత్రం ఆధిపత్యాన్ని కనపర్చలేకపోయింది. బ్యాటింగ్‌లో రాణించలేక 125 పరుగుల వద్దే చతికిలపడింది. అనంతరం ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ప్రారంభ ఓవర్లలో బౌలర్లు చెలరేగినప్పటికీ.. అదే ఒత్తిడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లపై కొనసాగించలేకపోయారు. లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి వ్యూహాలూ ఫలించలేదు. మూడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది రాజస్థాన్. పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి ఎగబాకింది.
ఈ పరాజయంపై మాజీల భగ్గు..
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వకపోవడం పట్ల టీమిండియా మాజీ కేప్టెన్.. తమిళనాడుకే చెందిన క్రిష్ణమాచారి శ్రీకాంత్ భగ్గుమన్నారు. దీనికి ధోనీ బాధ్యత వహించాల్సి ఉంటుందనీ చెప్పారు. ప్రత్యేకించి- తమ జట్టులో స్థానం దక్కించుకున్న కొంతమంది యంగ్ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించట్లేదని, వారిలో గెలవాలనే లోపించిందంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలను శ్రీకాంత్ తప్పు పట్టారు. యంగ్ క్రికెటర్లలో స్పార్క లేదంటూ ధోనీ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డాడు.

కేదార్ జాదవ్‌లో ఆ స్పార్క్ ఉందా?
యంగ్ క్రికెటర్ కేదార్ జాదవ్‌లో ఆ స్పార్క్ ఉందా? అని శ్రీకాంత్ ప్రశ్నించారు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ధోనీ గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి అనంతరం అతను చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించదలచుకోలేదని తేల్చి చెప్పారు. జట్టు ఎంపిక ప్రక్రియ మొత్తం ఏ మాత్రం బాగోలేదని అన్నారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కేదార్ జాదవ్‌ను ఆడించడం పట్ల శ్రీకాంత్ విమర్శించారు. కేదార్ జాదవ్‌లో ఏం స్పార్క్ ఉందని అతణ్ని తుదిజట్టులోకి తీసుకున్నారని ప్రశ్నించారు.

తమిళ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వరా?
కేదార్ జాదవ్ వరుసగా విఫలమౌతున్నాడనే విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశారు. ఇప్పటిదాకా అతను ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన కేదార్ జాదవ్ 62 పరుగుల మాత్రమే చేయగలిగాడు. కేదార్ జాదవ్‌కు వరుసగా అవకాశాలను ఇవ్వడాన్ని శ్రీకాంత్ పరోక్షంగా తప్పుపట్టారు. అతనికి ఎందుకు అవకాశాలను కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ధోనీ చెప్పే స్పార్క్ అతనిలో ఉందా? అని నిలదీశారు. యంగ్ క్రికెటర్ ఎన్ జగదీశన్‌కు తుది జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదని చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్.. 28 బంగుల్లో 33 పరుగులు చేశాడని చెప్పుకొచ్చారు. జగదీశన్ వంటి క్రికెటర్‌లో స్పార్క్ ఉందని చెప్పారు. దాన్ని జట్టు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోలేకపోయారని అన్నారు.